అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ నిక్కీ హేలీ

ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం కలిగిన బ్రిటన్ వంటి దేశానికి భారత సంతతికి చెందిన రుషి సునాక్ ప్రస్తుతం ప్రధాన మంత్రిగా పని చేస్తున్నారు. త్వరలోనే అగ్రరాజ్యం అమెరికాకు సైతం అధ్యక్ష పదవికి పోటీలో భారత సంతతికి చెందినవారు ముందున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన కమలా హ్యారీస్ ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆ దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు భారత సంతతివారు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు.
 
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా డెమొక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. కమలా హ్యారీస్ సైతం అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉంది. కాగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నానని మంగళవారం ఆమె ప్రకటించారు.
 
సౌత్ కరోలినాలోని బాంబెర్గ్‌లో 1970లో ఇండో-అమెరికన్ కుటుంబంలో నిక్కీ జన్మించారు. క్లెమ్సన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన ఆమె కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. 2010లో ఆమె సౌత్ కరోలినా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా చరిత్రలో తొలి మైనార్టీ మహిళా గవర్నర్‌గా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. 2014లోనూ ఆమె గవర్నర్‌గా ఎన్నికయ్యారు.
 
టైమ్స్ మ్యాగజీన్ ప్రపంచంలోని వంద మంది ప్రభావశీలురుల్లో ఒకరిగా నిక్కీని గుర్తించింది. 2016లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గవర్నర్ హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా నామినేట్ చేశారు.  రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో నిలవడం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నిక్కీ హేలీ ఛాలెంజ్ చేయనున్నారు.
 
ఇప్పటికే ట్రంప్ వయసు 76 ఏళ్లు కావడంతో.. 51 ఏల్ల నిక్కీ తనను తాను ‘నూతన తరం’ నాయకురాలిగా చెప్పుకుంటున్నారు. . హేలీ తన తదుపరి ప్రణాళికలకు సంబంధించిన విడుదల చేసిన వీడియోలో “నిక్కీ హేలీ, నేనే నిక్కీ హేలీ, నేనే అధ్యక్ష రేసులో ఉన్నాను” అని పేర్కొన్నారు. 
 
 ‘నేను అధ్యక్ష పదవి రేసులో ఉన్నాను. దేశ సరిహద్దులను కాపాడటం కోసం, ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉండటం కోసం, మన దేశాన్ని బలోపేతం చేయడం కోసం, మన ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి నూతన తరం నాయకత్వ పగ్గాలు చేపట్టాల్సిన సమయం వచ్చింది’ అని నిక్కీ వీడియో ద్వారా తెలిపారు. ఫిబ్రవరి 15న భారీ ప్రకటన చేస్తానని ఆమె చెప్పారు.
 
‘భారత్ నుంచి వలస వచ్చిన వారి కుమార్తెనని చెప్పుకోవడానికి గర్విస్తున్నా. బ్లాక్ (నల్లజాతి) కాదు.. (శ్వేత జాతి) వైట్ కాదు.. ఇది భిన్నమైంది’ అని నిక్కీ తన భారతీయ మూలాల గురించి గర్వంగా చెప్పుకున్నారు. ‘నీ ఫోకస్ ఎప్పుడూ వైరుధ్యాల మీద కాకుండా సారూప్యతల మీద ఉండాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది’ అని హేలీ చెప్పారు.
 
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పనితీరు అగాధంలో ఉందంటూ ఆమె ఎద్దేవా వేశారు. జో బిడెన్ రెండోసారి పదవికి అర్హులు కాదని ఆమె స్పష్టం చేశారు. నాయకత్వం వహించి ఎన్నికల్లో గెలుపొందగల రిపబ్లికన్లను మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నవంబర్ 5, 2024న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
 
హేలీ, ట్రంప్‌తోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్, ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్ పెన్సే తదితరులు రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉండనున్నారు.
 
నిక్కీ హేలీకి భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంతో సంబంధం ఉంది. పుట్టినప్పుడు ఆమె పేరు నిమ్రత నిక్కీ రాంధవా. అమె దక్షిణ కరోలినాలో భారతీయ పంజాబీ సిక్కు తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె తండ్రి అజిత్ సింగ్ రంధవా, తల్లి రాజ్ కౌర్ రంధవా. వాళ్లు అమృత్‌సర్‌ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమె తండ్రి గతంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, తల్లి ఢిల్లీ  విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు.
 
మరోవైపు ఇండో అమెరికన్ రిపబ్లికన్, వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా జరిగే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నిక్కీ హేలీ తన ప్రచార కార్యక్రమాన్ని మంగళవారమే ప్రారంభించగా రామస్వామి బుధవారం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మిలియనీరైన 37ఏళ్ల రామస్వామి మ్యాగజైన్ యాంటీ వోక్ ఇంక్ సిఇఒగా ఉన్నారు. యూఎస్‌లో నిజ నిర్ధారణ మిషన్‌లు ప్రారంభించారు.
 
యూఎస్ మీడియా నివేదిక ప్రకారం రామస్వామి అధ్యక్ష పదవి రేసులో పాల్గొనేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. రామస్వామి సంపద 500మిలియన్లు డాలర్లుకుపైగా ఉంటుందని మీడియా నివేదించింది. కాగా ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేయడం ద్వారా విజయవంతమైన బయోటెక్ వ్యాపారవేత్తగా రామస్వామి గుర్తింపు పొందారు.