బీబీసీ ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు

ప్రముఖ బ్రిటిష్ మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్‌ (బీబీసీ)పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ కార్యాల‌యాల్లో మంగళవారం ఐటీ శాఖ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ట్యాక్సేష‌న్‌, ట్రాన్స్‌ఫ‌ర్ ప్రైసింగ్‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు బీబీసీపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
 
ఈ నేప‌థ్యంలో బీబీసీపై ఐటీశాఖ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాలు ద్వారా తెలిసింది. ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో సుమారు 24 మంది అధికారులు నాలుగు బృందాలుగా  సోదాల్లో పాల్గొన్నారు. ముంబైలో ఉన్న బీబీసీ స్టూడియోస్‌లో కూడా అదే సమయంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకొంటున్నారు.
 
 అయితే సోదాలు కావని, కొన్ని పత్రాలను సరిచూసుకొనేందుకు సర్వే జరుపుతున్నామని  అధికార వర్గాలు తెలిపాయి. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీబీసీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వ‌ద్ద ఉన్న బ్యాలెన్స్ షీట్‌, అకౌంట్ల వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు. అలాగే కొందరు పాత్రికేయుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
 
పన్ను పత్రాల ధ్రువీకరించడానికి ఐటీ బృందం అక్కడికి చేరుకుందని, కొంతమంది ఉద్యోగులను కూడా కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లమని చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీబీసీ వ్యాపార కార్యకలాపాలు, భారత దేశంలోని బీబీసీ శాఖకు చెందిన కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.
‘మాకు కొన్ని వివరణలు కావాలి. దానికోసం మా బృందం బిబిసి కార్యాలయాన్ని సందర్శిస్తున్నాము. మేము సర్వే చేస్తున్నాము. మా అధికారులు చెక్‌ అకౌంట్‌ బుక్స్‌ని తనిఖీ చేయడానికి వెళ్లారు. ఇవి సోదాలు కాదు. పన్ను అధికారులు బిబిసి ఫైనాన్స్‌, బ్యాలెన్స్‌ షీట్ల వివరాలను అడిగారు’ అని ఆదాయపన్ను వర్గాలు తెలిపాయి. కేవలం సర్వే మాత్రమే అని.. సోదాలు కాదని జర్నలిస్టుల నుంచి తీసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను తిరిగి ఇస్తామని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఉద్యోగులకు తెలిపారు.
కాగా, ఈ సోదాలపై ప్రతిపక్షపార్టీ నేతల విమర్శలపై బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా విరుచుకుపడ్డారు. ‘ఏ వ్యక్తి లేదా ఏజెన్సీ చట్టానికి అతీతం కాదు. వారు భారతదేశంలో పనిచేస్తుంటే.. వారు భారతీయ చట్టాన్ని అనుసరించాలి. వారు చట్టవిరుద్ధంగా చేయకపోతే ఆందోళన ఎందుకు? ఏజెన్సీని ఎందుకు సమర్థిస్తున్నాయి? ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి’ అని భాటియా ధ్వజమెత్తారు.
 
ఇటీవ‌ల గోద్రా అల్ల‌ర్లపై బీబీసీ ఛాన‌ల్ ఓ డాక్యుమెంట‌రీని విడుదల చేయడంతో పెను దుమారం చెల‌రేగింది. దీనిని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించడంతో పాటు  సోష‌ల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల్లో ఆ డాక్యుమెంట‌రీని నిషేధించారు. రెండు భాగాలు ఉన్న ఆ డాక్యుమెంట‌రీని యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌లో కూడా నిషేధించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.  అయితే, కొన్ని ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీలలో నిషేధాలను ఉల్లంగిస్తూ బహిరంగంగా వాటిని ప్రదర్శించడం వివాదాలకు, శాంతిభద్రతల సమస్యలకు దారితీయడం జరిగింది.