అదానీ వ్యవహారంలో బిజెపి ఏం దాచడం లేదు.. భయపడటం లేదు

దేశంలో కలకలం రేపుతున్న అదానీ గ్రూప్ వ్యవహారంకు సంబంధించి బిజెపి ఈ విషయంలో ఏమీ దాచడం లేదని, దేనికీ భయపడడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయ విచారణ పరిధిలో ఉన్నందున తాను మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ నకు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ.  ఆశ్రిత పక్షపాతం అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

‘హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆధారంగా కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. అయితే, అదానీ వ్యవహారంపై దాచేందుకు కానీ, భయపడేందుకు కానీ బిజెపి ప్రయత్నించడం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలను బిజెపి హస్తగతం చేసుకుంటోంది అన్న కాంగ్రెస్, ప్రతిపక్షాల ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ ‘వారు కోర్టుకు వెళ్లవచ్చు, కోర్టులేమి బిజెపి ప్రభావంలో లేవు’ అని సూచించారు. ‘కోర్ట్ హమారే కబ్జేమే నహీ హై’ అని పేర్కొన్నారు.

‘‘ఈ అంశం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. ఒక మంత్రిగా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లిన అంశంపై మాట్లాడడం సరికాదు. కానీ, ఈ అంశంలో బిజెపి దాచడానికి ఏమీ లేదు. అలాగే, దేనికీ భయపడడం లేదు’’అని అమిత్ షా  ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. అదానీ అంశంపై అమిత్ షా స్పందించడం ఇదే మొదటిసారి.

ఈ విషయమై ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంటు లోపల, బయట ఖండిస్తూ మాట్లాడారు. ఈ అంశాన్ని నియంత్రణ సంస్థలే చూసుకుంటాయని ఆమె స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతిపక్షాల ఆరోపణలు అర్థం లేనివిగా కొట్టిపడేశారు

మోదీకి మద్దతుగా యావత్ దేశం

కాగా, 2024 ఎన్నికల్లో తమకు ఎలాంటి పోటీ ఉండదని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. యావత్ దేశం మోదీకి మద్దతుగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో చర్యలు, కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాల్లో సానుకూలమైన మార్పు కనిపిస్తోందని ఆయన చెప్పారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బిబిసి 2002 నుంచి వెంటాడుతుందని  అమిత్ షా చెప్పారు. ఏదైనా అంశంపై వేలాది కుట్రలు జరిగినప్పటికీ సత్యం కచ్చితంగా వెలుగులోకి వస్తుందని తెలిపారు. వార(బీబీసీ) 2002 నుంచి మోదీని వెంటాడుతున్నారని, అయితే మోదీ ప్రతిసారీ మరింత బలపడి, మరింత ప్రజాదరణను పొందుతున్నారని గుర్తు చేశారు.

‘ఎన్ని కుట్రలు జరిగినా ప్రధాని నరేంద్ర మోడీ మరింత బలోపేతం అయ్యారు. మోదీకి వ్యతిరేకంగా కుట్రలు 2002 నుంచే మొదలయ్యాయి. వేలాది కుట్రలైనా సరే సత్యాన్ని దెబ్బతీయలేవు’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా మోదీ వెంటే నిలబడతారని, తమకు పోటీ ఉండదన్న అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు.

ప్రజలు గత ఎన్నికల్లో ఎవ్వరికీ ప్రతిపక్ష హోదా కట్టబెట్టలేదన్న విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. అయితే, 2024 ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రధాన ప్రతిపక్షం ఎవరనేది తేలుస్తారని చెప్పారు.  ఎన్నికలు జరిగే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేయకపోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీ బలమేంటో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని అమిత్ షా ఎద్దేవా చేశారు.

ఈ రాష్ట్రాలతో పాటు, ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని అమిత్ షా అంచనా వేశారు. దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని చెబుతూ.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారినట్టు గుర్తు చేశారు. అంతర్గత భద్రతను తమ సర్కారు బలోపేతం చేసిందని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించినట్టు వివరించారు.