వామపక్షాలు – కాంగ్రెస్ కేరళలో కుమ్ములాటలు, త్రిపురలో స్నేహం

లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ హయాంలో త్రిపుర ఎంతో నష్టపోయిందని చెబుతూ వామపక్షాలు – కాంగ్రెస్ పార్టీ.. కేరళలో కమ్ములాడుతూ.. త్రిపురలో స్నేహం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు.త్రిపుర ఎన్నికల ప్రచారంలో సందర్భంగా సోమవారం అగర్తలాలోని స్వామి వివేకానంద స్టేడియంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ త్రిపురలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి కొనసాగింపు సాధ్యమవుతుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
త్రిపురలో కాంగ్రెస్, వామపక్షాల పొత్తు అనైతికమని ప్రధాని ధ్వజమెత్తుతూ గత 25 ఏళ్లలో అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలను కమ్యూనిస్టులు హత్యలు చేశారని, అందుకనే ఈ పొత్తును సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు సహితం ఆమోదింపలేక పోతున్నారని తెలిపారు. అందుకే, తిరిగి భారీ మెజారిటీతో తిరిగి బిజెపి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
 
మాణిక్ సాహా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లలోనే త్రిపురలో అభివృద్ధి జరిగిందని, శాంతి నెలకొందని ప్రధాని గుర్తు చేశారు. బీజేపీ.. రాజకీయాన్ని మార్పు కోసం చేస్తుందని, ప్రతీకారం తీర్చుకునేందుకు కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఒకవేళ మళ్లీ వామపక్షాలు, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం వస్తే త్రిపురకు అపార నష్టం జరుగుతుందని హెచ్చరించారు. “వాళ్లు త్రిపురను నాశనం చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతి కోసం బీజేపీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నా. త్రిపురకు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి” అని మోదీ విజ్ఞప్తి చేశారు.
 
“త్రిపుర ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని ఇళ్లు రాష్ట్రంలో లేదు. చందా, జెండా (వామపక్షాలు) వారికి త్రిపుర ప్రజలు రెడ్ కార్డు చూపించారు. సబ్‍కా సాత్ సబ్‍కా వికాస్ (అందరితో కలిసి, అందరి అభివృద్ధి) ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. త్రిపుర అభివృద్ధిని గాలికొదిలేసిన ఆ పార్టీలు జేబులు నింపుకున్నాయని ప్రధాని ఆరోపించారు. రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తేనే జారీ అయిన నిధులతో అభివృద్ధి కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు.
ఈశాన్య ప్రాంతంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అగర్తలా ముఖద్వారంగా మారిందని చెబుతూ త్వరలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని చెప్పారు. ప్రజలకు `విశ్వాసంగా సేవకు’నిగా ఈ ప్రాంత అభివృద్ధికి బిజెపి చేయవలసినంత కృషి చేస్తున్నదని ప్రధాని భరోసా ఇచ్చారు. బిజెపి హయాంలో ప్రజలకు ఉచిత రేషన్, ఆరోగ్య సంరక్షణ, గృహాలు, ఇతర సదుపాయాలు సమకూరాయని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద గృహాలు లభించని వారికి తిరిగి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లభిస్తాయని ప్రధాని హామీ ఇచ్చారు.
 
త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 16వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 2018లో పీపుల్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీటీఎఫ్)తో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పాలించిన సీపీఎంను ఓడించి బిజెపి అధికారాన్ని దక్కించుకుంది. ఈసారి కూడా బీజేపీ, ఐపీఎఫ్‍టీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఐదు స్థానాలను ఐపీటీఎఫ్‍కు బిజెపి కేటాయించింది. ఇక వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. మార్చి 2వ తేదీన త్రిపుర ఎన్నికల లెక్కింపు ఉంటుంది.