వారం రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించిన కేసీఆర్

కీలకమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మొక్కుబడిగా వారం రోజుల పాటు జరిపించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పూర్తి చేయించారు. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరగడం ఆనవాయితీ. పూర్వపు రోజులలో నెలన్నరపాటు జరిగేవి. కొద్దీ సంవత్సరాలుగా రెండు, మూడు వారాలకు పరిమితం చేస్తున్నారు. అయితే, వరుసగా రెండో ఏడాది ఈసారి కూడా వారం రోజులలోనే ముగించారు.

బహుశా దేశం మారే రాష్ట్రంలో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వారం రోజులలో ముగించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నా ప్రభుత్వం సమావేశాలను సావధానంగా జరపలేదు. పైగా కొద్దీ రోజులను కూడా కేవలం కేంద్ర ప్రభుత్వంపై దాడి చేయడం కోసం ఎక్కువగా ఉపయోగించుకున్నారు.

ఏడాదిలో వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ – వ్యయాలను వివరించేందుకు ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుంటాయి. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇదే వేదికగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తాయి. ఇంత కీలకమైన సెషన్స్ నిర్వహణలో తెలంగాణ సర్కార్ మాత్రం… గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది.

 
అనూహ్య పరిణామాల మధ్య ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. హైకోర్టు సూచనతోనే గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేశారు. 4వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానంపై చర్చించి, అదే రోజు ఆమోదించారు. 5వ తేదీన ఆదివారం సభకు విరామం ఇచ్చారు.
 
 ఫిబ్రవరి 6న ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 7వ తేదీన విరామం ఇచ్చి,  8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బడ్జెట్ పద్దులపై చర్చించారు. 11వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించిన తర్వాత.. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంటే.. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మినహాయిస్తే కేవలం 5 రోజులు మాత్రమే సభలో చర్చ జరిగింది.

మొత్తంగా,  ఈ సారి బడ్జెట్ సమావేశాలలో 56 గంటల 25 నిమిషాల పాటు సభ జరిగిందని శాసనసభ నివేదిక వెల్లడించింది. 41 మంది సభ్యులు ప్రసంగించారు. సీఎం, మంత్రులు కలిపి 30.43 గంటలు మాట్లాడారు. ఇందులో సీఎం కేసీఆర్ 2.31 గంటల పాటు వివిధ అంశాలపై ప్రసంగించారు.

మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ 5.20 గంటలు, సీఎల్పీనేత భట్టి విక్రమార్క 3.14 గంటలు మాట్లాడారు. పార్టీల వారీగా చూస్తే  బీఆర్ఎస్ సభ్యులు 11.05 గంటలు, ఎంఐఎం సభ్యులు 6.04 గంటలు,  కాంగ్రెస్ సభ్యులు 5.46 గంటలు, బీజేపీ సభ్యులు 2.33 గంటల పాటు వివిధ అంశాలపై ప్రసంగించారు. సభలో 5 బిల్లులకు ఆమోదం లభించింది. ఒక తీర్మానాన్ని స్వీకరించింది.

కేవలం 7 రోజుల్లోనే సభ ముగించడంతో.. గడిచిన, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ ప్రతిపాదనలు, వాస్తవ వ్యయాలపై సమగ్ర చర్చకు అవకాశమే లేకుండా పోయిందని ప్రతిపక్ష సభ్యుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఇంత తక్కువ కాలం బడ్జెట్ సమావేశాలు జరగడం ఇప్పటి వరకూ చూడలేదని.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సారి సభ నిర్వహణ తీరు చూస్తే.. ఇవి తెలంగాణ బడ్జెట్ సమావేశాలా ? లేక కేంద్ర బడ్జెట్ సమావేశాలా ? అనే అనుమానం కలిగిందన్నారు… కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి .. పూర్తి సమయాన్ని మోడీ ప్రభుత్వంపై దాడి చేయడానికే ఉపయోగించుకున్నారని అన్నారు.

రెండున్నర దశాబ్దాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని, కానీ ఇంత తక్కువ కాల బడ్జెట్ సమావేశాలను ఇంత వరకు చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వాపోయారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా,  ప్రభుత్వం వాటిపై చర్చకు అనుమతించ లేదని చెప్పారు. కేవలం ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సమావేశాలను బీఆర్ఎస్ ఉపయోగించుకుందని విమర్శించారు.

అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం చూస్తే డిసెంబర్, 2018లో రెండోసారి ఎన్నికైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకూ కేవలం 69 రోజులు మాత్రమే అసెంబ్లీ  సమావేశాలు నిర్వహించింది. 2022 లో కేవలం 10 రోజులే సమావేశాలు జరిపింది.  2014 నుంచి 2018 మధ్య మొదటి టర్మ్ లో 126 రోజులు సమావేశాలు జరిపారు.