వేలంలో అత్యధిక ధర స్మృతీ మందాన రూ. 3.40 కోట్లు

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) వేలంలో భార‌త ఓపెన‌ర్ స్మృతి మంధాన‌కు భారీ ధ‌ర ద‌క్కింది. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఈ స్టార్ ప్లేయ‌ర్ వేలంలో క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికింది. రూ. 3.40 కోట్ల‌కు ఈ స్టార్ క్రికెట‌ర్‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

ఆమె కోసం ముంబై, ఆర్సీబీ జట్లు పోటీ పడ్డాయి. రూ. 50 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర ఉన్న మంధాన‌ను కొనుగోలు చేసేందుకు ఐదు జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు ఆర్‌సిబి భారీ ధ‌ర‌కు ఈమెను ద‌క్కించుకుంది. డ‌బ్ల్యూపీఎల్ వేలంలో బ్యాట‌ర్‌ అష్‌లీ గార్డ్‌న‌ర్ (ఆస్ట్రేలియా), న‌టాలియె సీవ‌ర్ (ఇంగ్లండ్‌) రూ.3.20 కోట్ల ధ‌ర‌తో రెండో స్థానంలో నిలిచారు. గార్డ్‌న‌ర్‌ను గుజ‌రాత్ జెయింట్స్‌, న‌టాలియెను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేశాయి.

టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.80 కోట్లకు ముంబై దక్కించుకుంది. హర్మన్ కోసం ముంబై, యూపీ వారియర్స్ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఆష్లీ గార్డనర్‌‌ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌ సొంతం చేసుకుంది.

భార‌త స్పిన్న‌ర్ దీప్తి శ‌ర్మ రూ.2.60 కోట్లు ప‌లికింది. టీమిండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ను రూ. 2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ద‌క్కించుకుంది. ఇండియాకు అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన ష‌ఫాలీ వ‌ర్మ వేలంలో అద‌ర‌గొట్టింది. రూ.2 కోట్ల‌కు ఆమెను ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది.

 మరో ఆసీస్ ప్లేయర్ ఎలిస్ పెర్రీని రూ.1.70 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్‌ కనీస ధర రూ.50 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్‌ కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా రూ.1.80 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది.

ముఖ్యంగా అండ‌ర్ -19 జ‌ట్టులోని కీల‌క ప్లేయ‌ర్స్‌ హ‌వా కొనసాగింది. వీళ్ల‌ను  కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛేజీలు పోటీ ప‌డ్డాయి. అండ‌ర్ -19 టీమ్ కెప్టెన్, లేడీ సెహ్వ‌గ్‌గా పేరొందిన ష‌ఫాలీ వ‌ర్మ భారీ ధ‌ర ప‌లికింది. ఆమెను రూ.2 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ద‌క్కించుకుంది. విక‌ట్ కీప‌ర్ రీచా ఘోష్‌ను రూ.1.9 కోట్ల‌కు ఆర్సీబీ సొంతం చేసుకుంది.  హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (ఆల్‌రౌండ‌ర్‌) రూ.1.80 కోట్లు, య‌స్తికా భాటియా (వికెట్ కీప‌ర్‌) రూ.1.50 కోట్లు, రేణుకా సింగ్ (పేస‌ర్‌) రూ.1.50 కోట్లు, స్నేహ్ రానా (ఆల్‌రౌండ‌ర్‌) రూ.75 ల‌క్ష‌లు ప‌లికారు.

టీమిండియా మహిళా జట్టులో చోటు సంపాదించుకుని సత్తా చాటిన తెలుగమ్మాయి అంజలి శర్వాణిని యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ ఆమెను రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. గత డిసెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఈ లెఫ్టార్మ్ సీమర్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఆడింది. అలాగే, విజయవాడకు చెందిన టీమిండియా ప్లేయర్ సబ్బినేని మేఘనను గుజరాత్ జెయింట్స్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది.

బీసీసీఐ తొలిసారిగా నిర్వ‌హిస్తున్న డ‌బ్ల్యూపీఎల్ వేలం ముంబై వేదిక‌గా జ‌రుగుతోంది. మొత్తం 409మంది క్రికెట‌ర్లు వేలంలో ఉన్నారు. ఐదు ఫ్రాంఛైజీలు 90 మందిని కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డుతున్నాయి. ఇదే ప్రారంభ సీజన్ కావడంతో టాప్ ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచేజీలు పోటీ పడుతున్నాయి.

వేలంలో ఉన్నవారిలో 246 మంది టీమిండియా ప్లేయర్లు కాగా.. 163 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ప్రతీ టీం గరిష్టంగా ఒక ప్లేయర్ పై రూ.12 కోట్లు ఖర్చు చేసే అవకాశముంది. ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో సహా మొత్తం 18 మందిని వేలంలో కొనుక్కోవచ్చు. ఒక్కో ఫ్రాంచైజీ కనీసం 15 మందినైనా జట్టులోకి తీసుకోవాలి.

మార్చి 4న ముంబై వేదిక‌గా డ‌బ్ల్యూపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చిలోనే డబ్ల్యూపిఎల్ తొలి సీజన్ ప్రారంభించనున్నట్లు బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. డబ్ల్యూపిఎల్ మహిళా క్రికెట్ అభివృద్ధికి దోహదపడనుందని బోర్డు తెలిపింది. మార్చిలో ప్రారంభమయ్యే డబ్ల్యూపిఎల్ వచ్చే నెల 26వరకు జరగనుంది.