ఫాం హౌస్ కేసులో సిబిఐ దూకుడు.. కేసీఆర్ కు చుక్కెదురు!

తెలంగాణాలో రాజకీయ కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన  ఫాం హౌస్ కేసును సీబీఐకు అప్పగించాలంటూ స్పష్టం చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ కేసు చేపట్టడానికి సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తున్నది. అయితే ఏవిధంగా అయినా సిబిఐని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంకు చుక్కెదురవుతున్నది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసును సీబీఐకి అప్పగించకుండా నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్రప్రభుత్వానికి బుధవారం ఒకపక్క సుప్రీం కోర్టులో, మరోపక్క హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. సిబిఐ కేసు చేపట్టకుండా స్టే ఉత్తరువు తెచ్చుకోలేక పోయింది. మరోవంక, హైకోర్టు ఆదేశానుసారం ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను అప్పగించామని తెలంగాణ ప్రభుత్వంపై సిబిఐ వత్తిడి తెస్తున్నది. ఈ విషమై సీబీఐ అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే ఐదు సార్లు లేఖలు రాశారు.

మొదటి లేఖ గతేడాది 31న రాయగా, జనవరి 5, 9, 11, ఫిబ్రవరి 6న  మిగతా లేఖలు రాసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ  2022 అక్టోబర్ 26న హైకోర్ట్ ఆదేశించింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని  సీబీఐకు ఇవ్వాలని చెప్పింది.

 కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం బుధవారం నిరాకరించింది. కేసును విచారించి మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

ఫాం హౌస్ కేసులో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంను ఆశ్రయించింది. సీబీఐ కేసు విచారణ చేపడితే సాక్ష్యాలన్నీ ధ్వసం అవుతాయని పిటిషన్లో ఆందోళన వెలిబుచ్చింది. 

 ఇక హైకోర్టులో విషయానికొస్తే… రాష్ట్ర ప్రభుత్వం సింగిల్‌ జడ్జి బెంచ్‌ జస్టిస్‌ బీ విజయ్‌ సేన్ రెడ్డి ధర్మాసనం ఎదుట మంగళవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. సుప్రీం కోర్టుకు వెళ్లే వరకు వారం రోజుల పాటు ఈ కేసును సీబీఐకి అప్పగించకుండా నిలిపేయాలని ఆ పిటిషన్‌లో కోరింది. ఒకసారి డివిజన్‌ బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వ అప్వ అపీళ్లను కొట్టేసిన తర్వాత మళ్లీ తాము స్వీకరించవచ్చా? లేదా? అని సింగిల్‌ జడ్జి బెంచ్‌ అనుమానం వ్యక్తం చేసింది.

తాజా పిటిషన్‌ను స్వీకరించడానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ అనుమతి అవసరమని తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ బుధవారం చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం ఎదుట.. సింగిల్‌ జడ్జి పిటిషన్‌ను స్వీకరించేందుకు అనుమతించాలని కోరారు.  కేసు ఫైల్స్ ఇవ్వాలని సీబీఐ మళ్లీ లేఖ రాసిందని, సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్‌ను కోరారు.

అయితే డివిజన్ బెంచ్ తీర్పు వచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపకూడదని, సుప్రీంకోర్టు మాత్రమే దీనిపై సమీక్ష చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో దీనికి సంబంధించి వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.