ఎన్నికల వేళ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌, ప‌ల్లె నిద్ర‌

ఎన్నికల సంవత్సరం వస్తుండడంతో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పార్టీలు జనంలోకి వెళ్లేందుకు ముందుకు వస్తున్నాయి. ముందుగా టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం’ పాదయాత్రను ప్రారంభించారు. 400 రోజుల పాటు 4,000 కిమీ మేరకు మొత్తం 175 నియోజకవర్గాలను చుట్టి వచ్చేందుకు ప్రణాళిక వేసుకున్నారు.
 
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహితం జనంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ వాహనాన్ని సమకూర్చుకున్నారు. దీనితో  వారాహి యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. బిజెపి శ్రేణులు వై ఎస్ జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ లను విడుదల చేస్తూ ప్రతి గ్రామం చుట్టివచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
 
ఇలా ఉండగా, పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లి, అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తిరిగి జనంలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు.  రాష్ట్రంలో 151 స్థానాలను సొంతంచేసుకుని అధికారమలోకి వచ్చిన జగన్  వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
 
అందుకోసం పల్లె నిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల తరువాత బస్సు యాత్ర నిర్వహించడంతోపాటు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తున్నారు. ఆదిశగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. అసెంబ్లి సమావేశాల తరువాత రూట్‌మ్యాప్‌ కూడా ఖరారు చేయనున్నారు.
 
వీటికంటే ముందుగా మరో వినూత్న కార్యక్రమానికి జగన్‌ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనెల 11 నుండి సంక్షేమ ఫలాలు అందుతున్న ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అనే నినాదంతో స్టిక్కర్లను అంటించనున్నారు. ఈ  మూడు కార్యక్రమాలను నిర్వహించి ప్రజలతో మరింత మమేకం కావాలని సీఎం జగన్‌ యోచిస్తూ ఆదిశగా అడుగులు వేయబోతున్నారు. కీలకమైన ఈ  మూడు కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్‌ ముఖ్యమైన నాయకులతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది.
 
బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో పర్యటిస్తూ ప్రతి రోజూ ఏదో ఒక గ్రామంలో పల్లె నిద్ర చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పల్లె నిద్ర చేసే సందర్భంలో రచ్చబండ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. గతంలోనే రచ్చబండ నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కోవిడ్‌ తదితర కారణాలవల్ల రచ్చబండ కార్యక్రమం కొంత జాప్యం జరిగింది.