ఏపీ రాజధాని అమరావతి … కేంద్రం స్పష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైనట్లు పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పింది. సెక్షన్ 5, 6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందన్న కేంద్రం అమరావతే రాజధాని అని 2015 లో నిర్ణయించారని స్పష్టం చేసింది.
 
ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మూడు రాజధానులపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం  కేంద్రాన్ని సంప్రదించలేదని పేర్కొంటూ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో తమకేమీ సంబంధం లేదని కేంద్రం సంకేతం ఇచ్చింది.
 
అయితే రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కేంద్రం ముక్త కంఠంతో చెప్పిందా? అని ఎంపీ విజయసాయి రెడ్డి  ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని  అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం పేర్కొంది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని తెలిపింది.
 
2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును తెచ్చిందని, బిల్లు తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని, ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్రం వెల్లడించింది.కాగా, అమరావతిపై కేంద్ర ప్రకటన రాజధాని విషయంలో నిర్ణయం తీసుకొనే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించినట్లైంది. విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిందని, దాన్ని మార్చాలంటే మళ్లీ కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, విభజన చట్టంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే

కేంద్రం సమాధానం గమనిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ కేసుపై త్వరగా విచారణ జరపాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే, మరోసారి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇదే అంశాన్ని కోర్టు ముందు ఉంచారు.
 
దీన్ని పరిశీలించిన అపెక్స్ కోర్ ఈ నెల 23న దీనిపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అటు హైకోర్టులో వచ్చిన తీర్పే మరోసారి సుప్రీం కోర్టులోనూ వస్తుందని.. ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్‌కు మాత్రమే రాజధాని మార్పు అధికారం ఉందని భావిస్తున్నాయి.
 
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజధానుల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. ఈ నెల 23న విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందని.. ఈ వివాదంపై తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో.. కేంద్రం ప్రకటన చర్చనీయాంశంగా మారింది