బీజేపీ సభ్యులకు వసతి కల్పించట్లేదే!

తెలంగాణ శాసనసభ ఆవరణలో వసతుల కల్పనపై బీజేపీ సభ్యులకు వసతి కల్పించట్లేదని సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు గది కేటాయించక పోవడంపై మండిపడ్డ ఈటల తమ పార్టీ సభ్యులు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కార్లలో కూర్చుని టిఫిన్ చేస్తున్నామని చెబుతూ ప్రభుత్వం ఇలా వ్యవహరించటం ఎమ్మెల్యేలను అవమానించటమేనని ఈటల విమర్శించారు.
“బీజేపీ సభ్యలకు అసెంబ్లీలో వసతులు కల్పించట్లేదు. తమ సభ్యులు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేదు. కార్లలో కూర్చుని భోజనాలు చేస్తున్నాం. ముగ్గురు ఎమ్మెల్యేలం ఉన్నాం కానీ మాకు ఆఫీస్ ఇవ్వడం లేదు. కనీసం వాష్ రూమ్స్‌కు వెళ్లేందుకు కూడా మాకు అవకాశం లేదు. ఇంత అవమానమా ?” అని ప్రశ్నిచారు.
“ఈ విషయంపై స్పీకర్‌ను అర డజను సార్లు కలిశాం. ఏదైనా విషయం గురించి మా సభ్యులు కూర్చుని మాట్లాడేందుకు ఒక రూం ఇయ్యర? అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు ఆఫీస్ కేటాయించాలి. గతంలో లోక్ సత్తా పార్టీ సభ్యుడిగా జేపీ ఉన్నప్పుడు కూడా ఆయనకు రూం కేటాయించారు” అని గుర్తు చేశారు. “బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌కు కూడా మా ఎమ్మెల్యేలను పిలవటం లేదు. గతంలో సీపీఎం, సీపీఐ పార్టీల నుంచి ఒక్కో సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి వారిని పిలిచారు. ఇది అన్యాయం కాదా ?” అంటూ ఈటల సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈటల మాట్లాడుతుండగా మధ్యలో కలుగుజేసుకున్న మంత్రి హరీశ్ రావు ఐదుగురు సభ్యులు ఉంటేనే ఆఫీస్ ఇచ్చే సంప్రదాయం ఉందని చెబుతూ ఆ  విషయం సీనియర్ సభ్యులుగా మీకు తెలియదా? అని ఈటలను ప్రశ్నించారు. సౌకర్యాల గురించి ప్రస్తావించే వేదిక ఇది కాదని పేర్కొంటూ బడ్జెట్‌పై చర్చ జరగుతున్న సమయంలో బడ్జెట్‌పై మాత్రామే మాట్లాడాలని సూచించారు. సీనియర్ సభ్యుడిగా విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.

దళిత బంధు మాటలు కాగితాలకే పరిమితం
దళిత బంధు చాలా చోట్ల గ్రూండింగ్ కాలేదని, ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం కాగితాలకే  పరిమితం అవుతున్నాయని రాజేందర్ విమర్శించారు. అసలు దళిత బంధు అమలు ఎన్ని ఏళ్లలో పూర్తి చేస్తారు? అని ప్రశ్నిస్తూ  హుజూరాబాద్‌లో ఇప్పటికీ అన్ని కుటుంబాలకు దళిత బంధు రాలేదని చెప్పారు.
సరైన మార్గదర్శకాలు లేక లబ్ది దారుల్లో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.
 
70 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు. ఐకేపీ ఉద్యోగులకు స్కేలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. రిటైర్మెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఇవ్వడం లేదని, ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ పని చేయడం లేదని, మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకు జీత భత్యాలు లేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
 
కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందనడం తప్పుని స్పష్టం చేస్తూ రూ. 16వేల కోట్ల భూముల అమ్మకం బడ్జెట్‌లో చూపించారని, కానీ భూముల అమ్మకం ద్వారా రూ. 3 వేల కోట్లకు మించి రావని ఈటెల వ్యాఖ్యానించారు. 13 ఫెడరేషన్‌లకు కేటాయింపులే తప్ప ఖర్చు పెట్టడం లేదని చెబుతూ ప్రభుత్వం వైఫల్యాలను, చేతకాని తనాన్ని ఇతరుల మీదకు నెట్టడం సరికాదని హితవు చెప్పారు.
 
రాష్ట్రం వచ్చేనాటికి మన అప్పు రూ. 77, 333 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు అప్పు రూ. 3 లక్షల కోట్లు దాటిందని గుర్తు చేశారు. జీఎస్డీపీలో అప్పు 15 శాతం మించొద్దు.. కానీ అప్పు 38 శాతానికి పెరిగిందని ఆరోపించారు. అణగారిన వర్గాలకు ఐదు పైసలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్రం మద్దతు ధరల కోసం రాష్ట్రంలో రూ.  95 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ పూర్తి చేయటంతో పాటు మద్యాహ్న భోజన కార్మికులకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. 
 అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చకు రావడం లేదని ఈటల విచారం వ్యక్తం చేశారు. 20 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అంటే చిన్నచూపని అంటూ సమస్యను తెలిపేలోగానే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు.