కాంగ్రెస్ విద్వేష విధానం బయటపడింది

కాంగ్రెస్ విద్వేష విధానం బయటపడిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. లోక్ సభలో  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానమిస్తూ రాహుల్ గాంధీ తీరుపై మండిపడ్డారు. కొంతమంది ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని స్పష్టం చేశారు. కొంత మంది రాష్ట్రపతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
నిన్నటి రాహుల్ ప్రసంగంపై కొందరు సంబరాలు చేసుకుంటున్నారన్నారని చెబుతూ నిన్న ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని ఎద్దేవా చేశారు.  నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని విమర్శించారు. దూర‌దృష్టితో తీసుకున్న నిర్ణయాలు దేశ భవిష్యత్ కు పునాది అని స్పష్టం చేశారు.
 
యుపిఎ పాలనలో ఉన్న 2004 నుండి 2014 వరకు భారత్ కు అవకాశాలు కోల్పోయిన దశాబ్దం కాగా, 2030 భారత దేశపు దశాబ్దం కాబోతుందని భరోసా వ్యక్తం చేశారు. ప్రతి అవకాశాన్ని ఒక సంక్షోభంగా మార్చుకోవడం యుపిఎ ట్రేడ్ మార్క్ అంటూ దుయ్యబట్టారు. యుపిఎ దశాబ్దంలో ద్రవ్యోల్భణం రెండంకెలలో ఉండేదని గుర్తు చేస్తూ ఇప్పుడు ఏదైనా దేశానికి మంచి జరిగితే వారు తట్టుకోలేక పోతున్నారని ప్రధాని ధ్వజమెత్తారు.
 
గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపైన ఆధారపడేదని, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు. నేడు భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ చెప్పారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చని, తనకైతే గర్వంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
 
కొందరు నిరాశలో మునిగిపోయి దేశ విజయాలను సహించలేకపోతున్నారని మోదీ చెప్పారు. భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ చురకలు వేశారు. దేశంలో అవినీతిని తరిమికొట్టామని పేర్కొంటూ ఎన్నికలే జీవితం కాదని హితవు చెప్పారు.
 
దర్యాప్తు సంస్థలను విపక్షాలన్నీ కలిసి విమర్శలు చేస్తున్నాయని చెబుతూ ఈడీ దెబ్బకు ప్రతిపక్షనాయకులంతా ఏకతాటిపైకి వచ్చారని ఎద్దేవా చేశారు. అందుకోసం వారంతా ఈడీకి ధన్యవాదాలు తెలిపాలని ఎద్దేవా చేశారు. ఆర్థికాభివృద్ధిలో భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని చెబుతూపొరుగు దేశాల్లో పరిస్థితి భయంకరంగా ఉందని, అనేక దేశాల్లో ధరలు ఆకాశాన్నంటాయని గుర్తు చేశారు.
 
నేడు ప్రపంచంలో అంతర్జాతీయ పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తున్న  విశ్వసనీయత గల ప్రముఖ సంస్థలు అన్ని భారత్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని స్పష్టం చేస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు.
 
వార్త పత్రికలలో శీర్షికలు, టివి ఛానళ్లలో తన ఫోటోలు చూసి తన పట్ల ప్రజలలో విశ్వాసం నెలకొనలేదని ప్రధాని స్పష్టం చేశారు. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశానని, ప్రజలకు తనపై విశ్వాసం ఉందని, అది విపక్షాలకు అందదని ప్రధాని చెప్పారు.తాను దేశ ప్రజలకోసం 25 ఏళ్లుగా పనిచేస్తున్నానని చెబుతూ తనను దుర్భషలాడినా, తనపై విమర్శలు కురిపించినా ప్రజలు విశ్వసించరని తేల్చి చెప్పారు.
 
“బద్దాలాడుతూ మీరు ప్రజలలో ఇటువంటి విశ్వాసం పొందలేరు” అంటూ ప్రధాని ప్రతిపక్షాలను హెచ్చరించారు. కాంగ్రెస్ పతనం గురించి హార్వార్డ్ తో సహా ప్రపంచంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు పరిశోధన చేస్తాయని ఎద్దేవా చేశారు.