‘స్పెషల్ బ్లూ జాకెట్‍’ ధరించిన మోదీ

పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నిరంతరం అమితమైన శ్రద్ధ తీసుకుంటారు. వాతావరణ మార్పులను నియంత్రించే ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేశారు. 2019లో మహాబలిపురంలో బీచ్‍లో నడుస్తూ ఆయన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరారు. ప్లాస్టిక్‍ వాడకం మంచిది కాదంటూ చాలాసార్లు సందేశం ఇచ్చారు. మరోసారి పర్యావరణహిత సందేశాన్ని ప్రత్యేకమైన రీతిలో ఇచ్చారు.
కాగా, పార్లమెంట్ సమావేశాలకు బుధవారం ఆయన ఓ ప్రత్యేకమైన బ్లూ జాకెట్ ధరించి వచ్చారు. దీని ద్వారా కూడా ప్రధాని గ్రీన్ మెసేజ్ ఇచ్చారు ఇది సాధారణమైనది కాదు. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఈ జాకెట్ ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తయారు చేసింది.  పర్యావరణహితమైన దుస్తులను తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాకెట్‍ను రూపొందించింది.
 
పాలీ ఇథలీన్ టెరఫ్తలేట్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఈ బ్లూ జాకెట్‍ను తయారు చేసింది. బెంగళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో ప్రధాని మోదీకి సోమవారం ఈ జాకెట్‍ను ఇండియన్ ఆయిల్ అందించింది. దీన్ని ధరించి ప్రధాని బుధవారం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ జాకెట్‍పై సందేశం కూడా ఉంది.
 
పర్యావరణహితం కోసం 2046 కల్లా 10 కోట్ల పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. మినరల్ వాటర్, కూల్‍డ్రింక్ సహా ఇతర వాటి కోసం వినియోగించే పీఈటీ బాటిళ్లను రీసైకిల్ చేసి తమ సిబ్బందికి ఎకో-ఫ్రెండ్లీ యూనిఫామ్‍లను ఇస్తామని ప్రకటించింది.
ఒక్కో యూనిఫామ్ తయారీకి సుమారు 28 పీఈటీ బాటిళ్లను రీసైల్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ప్లాస్టిక్‍ను దుస్తులుగా మార్చేందుకు భారీ ప్రణాళికను ఇండియన్ ఆయిల్ సంస్థ రచించుకుంది.