అంతర్రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రతిపాదనలు కర్ణాటక ముందుంచినట్లు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. పరస్పర అవగాహనతోనే కృష్ణా జలాల వినియోగం జరగాలన్న ఉత్తమ్ ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకి అనుకూలంగా ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన సూచించారు.
తెలంగాణ, -కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై కర్ణాటక రాష్ట్ర చిన్ననీటి తరహా శాఖ మంత్రి బోసురాజు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం భేటీ అయ్యారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల వినియోగంపై పరస్పర అవగాహనతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు నిర్వహించామని పేర్కొన్నారు.
భవిష్యత్లో అనుసరించ బోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిళ్ల కుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను కర్ణాటక చిన్న నీటి తరహా శాఖ మంత్రి బోసురాజుకు సమగ్రంగా వివరించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ సాగునీటి, త్రాగునీటి హక్కులు పరిరక్షణ భవిష్యత్ అవసరాలకు అనుసరించాల్సిన విధి, విధానలపై ప్రాథమిక చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. కృష్ణా నది జలాశయాల వినియోగంపై జరిగిన ఉభయ రాష్ట్రాల చర్చల్లో తెలంగాణ రైతాంగం సాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి చర్చించినట్లు ఆయన తెలిపారు. సాగునీటి, త్రాగునీటి విషయంలో రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లకుండా ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా కృష్ణా జలాల వినియోగంపై కూలంకషంగా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయని ఆయన తెలిపారు.
రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి వివరించి సమష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, రాయచూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణానదిపై కర్ణాటక కొత్త ఆనకట్టను ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన ప్రతిపాదనలపై బోసురాజుతో చర్చించారు.

More Stories
గోహత్యలు ఆపేందుకు చర్యలు తీసుకుంటా
పరిగి కొనుగోలు కేంద్రంలో “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర
నేడు తాండూరు నుంచి ‘రైతు గోస-బిజెపి భరోసా’