మూడేళ్ళలో రెండింతలైన ఏపీ అప్పులు

ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 2019తో పోలిస్తే దాదాపు రెండింతలయ్యాయని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి మంగళవారం రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోందని చెప్పారు.
 
బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4, 42, 442 కోట్లు అని పంకజ్ చౌదురి తెలిపారు. 2019లో అప్పు రూ.2,64, 451 కోట్లు ఉండగా, 2020లో రూ.3,07, 671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022లో రూ.3,93,718 కోట్లు కాగా, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరిందని తెలిపారు.
 
బడ్జెట్ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు అదనమని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇలా ఉండగా,  జనవరి నుంచి మార్చి కాలానికి గాను రూ.12,000 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆర్బీఐకి అప్పుల కేలండర్‌ పంపింది. జనవరిలో రూ.7,000 కోట్లను, ఫిబ్రవరిలో రూ.4,000 కోట్లను, మార్చిలో రూ.1,000 కోట్లను తీసుకుంటామని పేర్కొంది.
 
ప్రస్తుతం రాష్ట్రం అప్పులు రూ.9 లక్షల కోట్లు దాటేశాయి. జీఎస్‌డీపీలో ఇవి 75 శాతంగా ఉన్నాయి. 2018లో కేంద్రం సవరించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు జీఎ్‌సడీపీలో 20 శాతం మించకూడదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఉండాల్సిన పరిమితి కంటే 55 శాతం ఎక్కువగా ఉన్నాయి. చెల్లించాల్సిన బిల్లులతో కలిపి గత ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ప్రభుత్వ అప్పులు రూ.1,04,000 కోట్లకు చేరాయి. అయినా కొత్త అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తోంది.