అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని నిర్మిస్తాం

త‌మ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ  గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ రాజధానిని నిర్మించలేదని గుర్తు చేశారు.
 
మూడు రాజధానులని అంటున్న సీఎం జగన్ వాటికి కనీసం రూ.300 కూడా ఖర్చు చేయలేదని సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీలోని ఎమ్మెల్యేలు పరిపాలకులుగా కాకుండా కేవలం ట్రేడర్స్ గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో కుటుంబ రాజకీయ పరిపాలన కొనసాగుతోందని పేర్కొంటూ కుటుంబ పరిపాలనకు బీజేపీ దూరమని చెప్పారు.
 
 రాష్ట్రానికి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం గత నాలుగు సంవత్సరాలుగా రూ. 16 వేల కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు.  కేవలం ఎడ్యుకేషన్ లోనే 10 రత్నాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. 60 సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తోందని తెలిపారు.
 
 జగన్ కంటే మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రంలో అధికమని చెప్పారు. 2024 అధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పత్తికొండ ప్రాంతంలో రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన 29 ఎకరాలను నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు.
 
రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసి లక్ష సమస్యలు సేకరించి జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామని ప్రకటించారు. కర్ణాటకలో తుంగభద్రపై నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల రాయలసీమకు దక్కాల్సిన వాటాలో అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని పేర్కొంటూ, వైసీపీ కి తాము మాత్రమే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు.

 
కర్నూలు జిల్లా లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక మంత్రి కూడా భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారని సోము వీర్రాజు ఆరోపించారు. వారిని అడ్డుకునే ప్రభుత్వం రావాలంటే బీజేపీని ప్రజలు బలపర్చాలని కోరారు. కర్నూలుకు కేంద్రం సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చిందని, లక్ష కోట్లతో రాయలసీమలో జాతీయ రహదారులు అభివృద్ధి చేసామని సోము గుర్తుచేశారు. రైల్వే లైన్ ఆధునీకరణ కూడా చేస్తామని పేర్కొన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న బీజేపీకి ఓటర్లు ఈసారి మద్దతునివ్వాలని సోము కోరారు.