2026 నాటికి పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌

పోలవరం ప్రాజెక్టులో భాగంగా 5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీజెన్‌కో తెలిపిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు.

ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాజ్యసభలో జవాబిస్తూ ఏపీజెన్‌కో (ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఏపీజెన్‌కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సొంత నిధులతోనే అమలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అందుకు నిధులేమీ కేటాయించడం లేదని మంత్రి తెలిపారు.

కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోగా పూర్తి చేయడం కష్టమేనని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు స్పష్టం చేశారు. 2020, 2022లో వచ్చిన వరదల కారణంగా  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేమని  తెలిపారు. 2024లోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా వరదల కారణంగా పనుల్లో జాప్యం జరిగినట్లు చెప్పారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.13,226కోట్లను కేంద్రం విడుదల చేసిందని  మరో రూ.2,390 కోట్లు విడుదల చేయాల్సి ఉందని తెలిపారు.