వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లాలో వివాదాస్పద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద విచారణ ముగించుకుని బయటకు రాగానే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
 
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని, ప్రలోభాలకు గురి చేశారని ఎమ్మెల్సీ అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  దాంతో గత మూడు రోజులుగా పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు రాజమండ్రి కోర్టు సమీపంలో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. అనంతబాబును పోలీసులు కాకినాడలోని స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్​ విధించింది. 
 
ఇప్పటికే ఈ హత్య కేసులో బెయిల్‌పై ఉన్న ఆయన, తనపై ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవడానికి సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని సాక్షులు స్వయంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.   సాక్షులను బెదిరించిన వ్యవహారంలో మూడు రోజుల క్రితమే పోలీసులు ఆయనను పట్టుకోవాల్సి ఉండగా, అప్పటి విచారణాధికారి అనంతబాబుకు ముందస్తు సమాచారం చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
కేసు దర్యాప్తు బాధ్యతలను కొత్త అధికారికి అప్పగించిన వెంటనే పోలీసుల వ్యూహం పూర్తిగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, నిఘా వర్గాల సహకారంతో అనంతబాబు కదలికలను నిశితంగా గమనించారు. ఆయన రాజమండ్రి కోర్టుకు హాజరయ్యేందుకు వస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్పీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 
 
మూడు రోజుల పరారీకి తెర దించుతూ ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతబాబు ఈ కేసులోని నలుగురు కీలక సాక్షులకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఇచ్చే విధంగా బేరసారాలు సాగించినట్లు ఆధారాలు లభించాయి. డబ్బుతో లొంగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సాక్షులను భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది
మరోవైపు సాక్షులను బెదిరించారని తనపై నమోదైన కేసును కొట్టివేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  తన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ మీద శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.
 
ఇదే సమయంలో అనంతబాబు బెయిల్‌ షరతులు ఉల్లంఘించారని, డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ కోసం అనంతబాబు భార్య లక్ష్మీదుర్గతో కలిసి  రాజమహేంద్రవరం కోర్టుకు రాగా కోర్టు పరిసరాల్లో మఫ్టీలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.