తిరుమల శ్రీవారికి రూ.206 కోట్లు విలువ గల ఆభరణాలు అందజేత

తిరుమల  చరిత్రలో మున్నెన్నడు లేని విధంగా ఓ భక్తుడు స్వామివారికి భారీ విరాళాన్ని అందజేశారు. చెన్నైకి చెందిన వర్దమాన జైన్‌ అనే భక్తుడు సుమారు రూ.206 కోట్ల విలువగల 121 కిలోల శ్రీవారికి అలంకరిచే అన్ని రకాల అభరణాలు తయారు చేయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. గతంలోను 2025 జనవరిలో రూ.6 కోట్లు విరాళాన్ని ఆయన అందజేశారు.

ఆభరణాలను ట్రంకు పెట్టెల్లో శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వేంకటేశ్వరస్వామికి భక్తులు ఇచ్చిన కానుకల్లో ఇదే అతి పెద్దదని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీవారికి అలంకరించే అన్ని రకాల ఆభరణాలు తయారు చేయించారు. శ్రీవారి శిరస్సు నుంచి పాదాల వరకు అన్నిరకాల ఆభరణాలను విరాళంగా అందజేశారు.  

వర్ధమాన్ జైన్ 121 కిలోల బంగారంతో రూపొందించిన 46 ఆభరణాలను శ్రీవారికి సమర్పించగా, 14 కిలోల బంగారంతో పద్మావతి అమ్మవారికి చీరను అందించారు.   గతంలో 2025 జనవరి 19న స్వామి వారికి రూ.6 కోట్లు, మే 16న ఎలక్ట్రిక్‌ బస్సును ఆయన విరాళంగా అందజేశారు. తాజాగా ఇచ్చిన 121 కిలోల ఆభరణాల్లో 47 రకాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.206 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

శ్రీవారు నిత్యం సుమారు 120 కిలోల మేర ఆభరణాలు ధరిస్తారు. ఈ నేపథ్యంలో 121 కిలోల బంగారు నగలను భక్తుడు సమర్పించారు. వర్ధమాన్‌ జైన్‌ ఓ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహించారు. అందులో కొంత వాటా విక్రయం ద్వారా పెద్ద మొత్తం వచ్చింది. అదంతా స్వామివారి అనుగ్రహమేననే భావనతో భారీ కానుక ఇచ్చారు.

రామమందిరానికి 67 కిలోల బంగారం అందితే, శ్రీవారికి 121 కిలోల బంగారం అందడం స్వామివారి గొప్పతనానికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీవారికి భక్తులు సమర్పించే ప్రతి విరాళానికి పూర్తి లెక్కలు ఉంటాయని స్పష్టం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో గోసంరక్షణ, వేద పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

శ్రీవారి సేవకులు భగవంతుడి సేవ చేయాలనే సంకల్పంతో వస్తున్నారని, వారి సంఖ్యను మరింత పెంచాలని, ఎక్కడ సేవకుల అవసరం ఉన్నా వారిని ప్రోత్సహించాలని సూచించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ చర్యలు తీసుకోవాలని, ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించాలని తెలిపారు. 

తిరుపతిలోని అన్ని సంస్థలను శ్రీవారి సేవకులతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. సేవకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు విద్యాదాన పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడాన్ని కూడా ప్రోత్సహించాలని సూచించారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల నీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.  

About The Author