ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ లో ఖాళీగా ఉన్న చైర్‌పర్సన్, సభ్యుల పదవులను తక్షణమే భర్తీ చేయాలని హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అకిసా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిలకు వ్రాసిన లేఖలో చాలాకాలంగా చైర్‌పర్సన్, సభ్యులు లేకుండా కమిషన్ కొనసాగుతూ ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఖాళీల కారణంగా, 1993 మానవ హక్కుల రక్షణ చట్టం ప్రకారం చేపట్టాల్సిన విధులు, బాధ్యతలను కమిషన్ సమర్థవంతంగా నిర్వర్తించలేకపోతోందని, దానితో కమిషన్ ఎదుట అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. గతంలో భారత సుప్రీంకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు మానవ హక్కుల కమిషన్‌లలో ఖాళీలను భర్తీ చేయాలని నోటీసులు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏ.ఎం. ఖాన్విల్కర్ మరియు డి.వై. చంద్రచూడ్ గార్లతో కూడిన బెంచ్ హోమ్ మంత్రిత్వ శాఖ నుండి స్పందన కోరిందని చెప్పారు. పైగా, సమర్థవంతమైన కమిషన్ లేకపోవడం పౌరులకు, ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పరిష్కారం కోరుతున్న వారికి, తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తోందని ఆయన తెలిపారు.
ఇది రాష్ట్రంలో మౌలిక హక్కుల రక్షణ, ప్రోత్సాహాన్ని కూడా దెబ్బతీస్తుందని బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, వెంటనే చైర్‌పర్సన్, సభ్యుల నియామక ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. 1993 మానవ హక్కుల రక్షణ చట్టంలోని నిబంధనల ప్రకారం కమిషన్ పూర్తిగా కార్యాచరణలోకి వచ్చేవిధంగా చూడాలని కోరారు.
ఇలా ఉండగా, కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ 1, 2021లో ఏర్పాటు అయిన ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం మొదటి నుండి సిబ్బంది కొరతతో నానా అవస్థలు పడుతోంది. విచారణలు పూర్తైన తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేసే విషయంలో డిక్టేషన్ తీసుకునేందుకు టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, కోర్టు మాస్టర్ లేకపోవడంతో ఇదివరలో స్వయంగా ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి కంప్యూటర్ ముందు కూర్చొని వ్యక్తిగతంగా టైప్ చేసి, తుది ఉత్తర్వులను సిద్ధం చేసేవారు.

More Stories
మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహంతో సమానం
రాజమండ్రి- విశాఖ మధ్య రూ.9,889 కోట్లతో మరో 2 రైల్వే లైన్లు
ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం శాశ్వత దిక్సూచి