మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహంతో సమానం 

మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహంతో సమానం 
 
మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహంతో సమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.  తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మహిళల రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై నిరసన ర్యాలీని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జనసేన నాయకుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. 
‘పార్లమెంటులో మహిళలకు అన్యాయం జరిగింది. భారతదేశ చరిత్రలో బ్లాక్‌డే’ అని పేర్కొంటూ దీనికి నిరసనగా శనివారం ఉద్యమాన్ని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో దీనికి శ్రీకారం చుట్టారు. మహిళలతో కలిసి మండుటెండలో సుమారు 2కిలోమీటర్లు నిరసన తెలుపుతూ స్వచ్ఛాంధ్ర వేదిక వరకూ పాదయాత్ర చేశారు.  ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడమనేది ద్రోహమంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించడం సంస్కృతి అని చెబుతూ సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మహిళా లోకమంతా ఏకమైందని వివరించారు.  పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవడం క్షమించరాని నేరమని ధ్వజమెత్తారు. అదేవిధంగా మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే నినాదంతో ముందుకెళ్లాలని సీఎం సూచించారు. 
“మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని అందరం అనుకున్నాం. 33 శాతం మంది మహిళలను చట్టసభల్లో చూస్తామని ఆశపడ్డాం. అందరూ ముందుకొచ్చిన సమయంలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మహిళలకు ద్రోహం చేశాయి” అని ధ్వజమెత్తారు. దీనిపై మహిళా లోకం ఒక్కటవ్వాలని పిలుపిచ్చారు. మహిళల రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నామని పేర్కొంటూ పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. ఆడబిడ్డలను కేవలం ఇంటి వరకే పరిమితం చేయాలని దుర్మార్గ ఆలోచన తగదని సీఎం హితవు పలికారు.  విపక్షాల ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని చెబుతూ మహిళా సాధికారత కోసం అడ్డంకులు సృష్టించకూడదనే కర్తవ్యం విపక్షాలపై ఉందని హితవు చెప్పారు. 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, 2029 నాటికి మహిళలకు రిజర్వేషన్ల అమలు యోచనతో కేంద్రం సహృదయంతో ముందుకొచ్చిందని తెలిపారు.
ఇంట్లో ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేని పరిస్థితి ఉందని సీఎం బాధపడ్డారు. దీన్ని వదిలిపెట్టే సమస్య లేదని, విపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేయాలని చెబుతూ అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా చేపట్టిన ర్యాలీ హెలీప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు సాగింది.