
“ఇంధన పరివర్తన, సరికొత్త ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రపంచంలో బలంగా గళం వినిపిస్తున్న భారతదేశం ఒకటి. ఆ మేరకు వికసిత భారతం సంకల్పంతో ముందుకెళ్తున్న మనదేశ ఇంధన రంగంలో అవకాశాలు అపారం” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023కు శ్రీకారం చుట్టారు.
అలాగే ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (ఐఓఎల్) ‘అన్ బాటిల్డ్’ కార్యక్రమం కింద యూనిఫారాలను ప్రారంభించారు. వీటిని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ సీసాల (పెట్ బాటిళ్లు)తో తయారుచేశారు. దీంతోపాటు ‘ఐఓఎల్’ రూపొందించిన ఇన్‌డోర్ సౌరశక్తి వంట వ్యవస్థ జంట స్టవ్‌లను జాతికి అంకితం చేయడంతోపాటు మార్కెట్ ప్రవేశం చేయించారు.
అనంతరం ఇథనాల్ మిశ్రమ మార్గప్రణాళికకు అనుగుణంగా 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని చమురు విక్రయ కంపెనీలకు చెందిన 84 చిల్లర విక్రయ కేంద్రాల్లో ‘ఇ20’ ఇంధన విక్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. మరోవైపు హరిత రవాణా ప్రదర్శనకు కూడా ప్రధానమంత్రి జెండా ఊపి శ్రీకారం చుట్టారు. హరిత ఇంధనాలపై ప్రజల్లో అవగాహన పెంపు దిశగా చేపట్టిన ఈ ర్యాలీలో హరిత ఇంధనంతో నడిచే వాహనాలు పాల్గొన్నాయి.
భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఒకటని పేర్కొంటూ ‘ఐఎంఎఫ్’ ఇటీవల ప్రకటించిన అంచనాలను ప్రధాని ప్రస్తావించారు. ప్రపంచం నేడు మహమ్మారి, యుద్ధం నడుమ చిక్కుకున్న నేపథ్యంలో భారతదేశం ఉజ్వల తారగా ప్రకాశిస్తున్నదని ప్రధాని అభివర్ణించారు. బాహ్యకారకాలతో నిమిత్తం లేకుండా ఎలాంటి అవరోధాన్నయినా అధిగమించగల సామర్థ్యాన్ని భారత ప్రతిరోధకత మనకు కల్పించిందని గుర్తుచేశారు.
దేశంలో పేదరికం నుంచి మధ్యతరగతి స్థాయికి చేరుకున్న కోట్లాది ప్రజల జీవన నాణ్యతలో వచ్చిన సానుకూల మార్పులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశంలో 6,00,000 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ లైన్ ఏర్పాటు చేశామని, తద్వారా ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ సదుపాయం ఉందని ఆయన తెలిపారు.
గత 9 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 13 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా మూడు రెట్లు పెరిగాయని ప్రధానమంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య వేగంగా పెరుగుతోందని చెప్పారు.
అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ 2వ అతిపెద్ద దేశంగా అవతరించిందని ప్రధాని వెల్లడించారు. “భారత ప్రజలు మెరుగైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు, మరింత మెరుగైన మౌలిక సదుపాయాలను ఆకాంక్షిస్తున్నారు” అని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో భారతదేశంలో ఇంధన ఆవశ్యకతను, పెరిగే డిమాండ్‌ను ప్రస్తావిస్తూ అభివృద్ధి శరవేగం అందుకుంటున్నందున కొత్త నగరాలు ఆవిర్భవిస్తాయని తెలిపారు.
అంతర్జాతీయ ఇంధన సంస్థను ఉటంకిస్తూ- ప్రస్తుత దశాబ్దంలో భారత ఇంధన డిమాండ్లు అత్యధికంగా ఉంటాయని, తద్వారా ఈ రంగంలోని పెట్టుబడిదారులకు, భాగస్వాములకు అపార అవకాశాలు కలిసివస్తాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచ చమురు డిమాండ్‌లో భారత్ వాటా 5 శాతం కాగా, 11 శాతానికి వరకు పెరుగుతుందని అంచనాలున్నట్లు పేర్కొన్నారు. అలాగే భారత గ్యాస్ డిమాండ్ కూడా 500 శాతందాకా పెరుగుతుందని అంచనా. ఈ విధంగా దేశంలో ఇంధన రంగం విస్తరణతో పెట్టుబడులు, సహకారం దిశగా సరికొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
More Stories
సద్గురు జగ్గీ వాసుదేవ్ కి వాటర్ ఛాంపియన్ అవార్డు
మంగోలియన్ బాలుడిని 3వ అత్యున్నత నేతగా పేర్కొన్న దలైలామా
నేటి నుండే విశాఖలో జీ–20 సదస్సు పట్టణీకరణపై దృష్టి