ట‌ర్కి భూకంపంలో 10వేల మంది మృతి?.. భారత్ భారీ సహాయం

ట‌ర్కీ కేంద్రంగా నేటి ఉద‌యం సంభవించిన పెను భూకంపం వ‌ల్ల ట‌ర్కీ, సిరియా దేశాల్లో ఇప్ప‌టికే సుమారు 2 వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.. అయితే ఈ భూకంపం వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య దాదాపు ప‌ది వేల‌కు చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు అమెరికాకు చెందిన జియోలాజిక‌ల్ స‌ర్వే అంచ‌నా వేసింది.
 
ఇలా ఉండగా, భారీ భూకంపంతో టర్కీ అతలాకుతలమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను టర్కీ పంపిస్తున్నారు.
 
అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపిస్తున్నారు. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్తున్నాయి.
 
ద‌క్షిణ ట‌ర్కీలో 7.8 తీవ్ర‌త‌తో ఇవాళ తెల్ల‌వారుజామున అత్యంత శ‌క్తివంత‌మైన భూకంపం న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. భూక‌పం తీవ్ర‌త‌కు అత్య‌ధిక జ‌న‌వాసాలు క‌లిగిన భ‌వ‌నాలు పేక‌మేడ‌ల్లా కుప్ప‌కూలాయి.. ఈ రెండు దేశాల‌లో వేలాది భ‌వ‌నాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి.. శిధిలాల కింద వేలాదిమంది చిక్కుకున్నారు.. స‌హాయ కార్య‌క్ర‌మాలు కొనసాగుతున్నాయి..
 
ప‌లుదేశాలు ట‌ర్కి, సిరియా దేశాల‌కు విప‌త్తు స‌హాయ బృందాల‌ను పంపాయి.. భార‌త్ కూడా అత్య‌వ‌స‌రంగా స‌హాయ సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది.. కాగా,ఈ ప్రాంతంలో వ‌చ్చిన భూకంపాల చ‌రిత్ర ఆధారంగా యూఎస్‌జీఎస్ మ‌ర‌ణాల‌ను ఈ అంచ‌నా వేస్తోంది. షేకింగ్ ఎక్కువగా జ‌రిగిన ప్రాంతాల్లో ఉండే జ‌నాభా ఆధారంగా కూడా ఈ లెక్క వేయ‌నున్నారు.
 
అత్యంత ప్ర‌భావానికి గురైన ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌ల ఆధారంగా కూడా మ‌ర‌ణాల సంఖ్య‌ను అంచ‌నా వేయ‌నున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే ఛాన్సు ఉంద‌ని, న‌ష్టం కూడా విస్తృత స్థాయిలో ఉంటుంద‌ని, ఇంకా ఆ భూకంప ప్ర‌భావం పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. క‌నీసం ప‌దివేల మంద‌కి పైగా మ‌ర‌ణాలు సంభ‌వించి ఉండ‌వ‌చ్చ‌ని ఈ సంస్థ అంచ‌నా వేసింది. తాజా భూకంపం వ‌ల్ల ఆర్ధిక న‌ష్టం బిలియ‌న్ డాల‌ర్ నుంచి ప‌ది బిలియ‌న్ల డాల‌ర్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. న‌ష్టం మొత్తం ట‌ర్కీ జీడీపీలో రెండు శాతం వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.
 
కాగా, ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో కనీసం వందమంది సిబ్బంది ఉంటారని వీరు టర్కీ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. డాగ్ స్క్వాడ్ కూడా ఎన్‌డీఆర్ఎఫ్‌ టీమ్‌తో వెళ్తోంది. మెడికల్ బృందాల్లో శిక్షణ పొందిన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఔషదాలు, ఇతర సహాయ సామాగ్రి కూడా తీసుకెళ్తున్నారు.
 
టర్కీ ప్రభుత్వంతో పాటు అంకారాలోని భారత ఎంబసీతో పాటు ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయంతో భారత బృందాలు సమన్వయం చేసుకుంటాయి. ప్రధానమంత్రి మోదీ ఆదేశాలతో పీఎంఓలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేబినెట్ కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆరోగ్య శాఖ, ఎన్డీఆర్ఎఫ్ విభాగంలోని ప్రతినిధులు హాజరయ్యారు.
 
టర్కీ లోని 10 నగరాలపై భూకంప ప్రభావం ఉన్నట్టు టర్కీ దేశీయాంగ మంత్రి సులేమాన్ సోయిల్ తెలిపారు. గజియాన్‌టెప్, కహ్రమాన్‌మరస్, హటాయ్, ఒస్మానియె, అడియమన్, మలట్య, అడన, కిలిస్ తదితర నగరాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.