టర్కీ, సిరియాలను కుదిపేసిన భూకంపం.. 200 మంది దుర్మరణం

భారీ భూకంపం టర్కీ, సిరియాలను కుదిపేసింది. గజియాన్టెప్‌ ప్రావిన్స్‌లోని నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదయిందని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ వెల్లడించింది. సోమవారం ఉదయం 4.17 గంటలకు భూమికంపించిందని, నుర్దగీకి 26 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. అటు లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సైప్రస్ లోనూ భూమి కంపించింది.
 
భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చిందని తెలిపింది. టర్కీలోని  గాజియాన్‌ తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  భూకంపం సంభవించిన పావుగంట తర్వాత 6.7 తీవ్రతతో మరోసారి శక్తిమంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారన్నారు. మృతుల  సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
 
భారీ భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భవనాలు కూలిపోవడంతో ఇప్పటివరకు సుమారు 200 మందివరకు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
 
టర్కీకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెప్‌.. సిరియా సరిహద్దుల్లో ఉన్నది. భూకంప ప్రభావతంతో లెబనాన్‌, సిరియా, సైప్రస్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సిరియాలోని పశ్చిమ తీరప్రాంతమైన లటకియాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.
 
టర్కీలోని  దియర్‌బకీర్‌ ప్రాంతంలో ఓ భవనం పేకమేడలా కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక హతయ్  ప్రాంతంలో భూకంప తీవ్రతకు సహజవాయువు గ్యాస్‌ పైప్‌లైను పేలి భారీగా మంటలు చెలరేగాయి.  టర్కీలోని  దియర్‌బకీర్‌ ప్రాంతంలో ఓ భవనం పేకమేడలా కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక హతయ్  ప్రాంతంలో భూకంప తీవ్రతకు సహజవాయువు గ్యాస్‌ పైప్‌లైను పేలి భారీగా మంటలు చెలరేగాయి.
 
కాగా, 1999లో టర్కీలో 7.4 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌ నగరంలోనే వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు. ఇక 2020లో ఎలజిగ్​ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి 40 మంది బలయ్యారు. గతేడాది అక్టోబర్‌లో 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపంతో 114 మంది మరణించారు. మరో వెయ్యి మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.