బాంగ్లాదేశ్ లో 14కు పైగా ఆలయాల ధ్వంసం

బంగ్లాదేశ్​లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడి ఘటనలు ఆందోళకరంగా ఉన్నాయి. తాజాగా  14 హిందూ ఆలయాలపై పలువురు దుండగులు దాడి చేశారు. ప్రధకం​ ప్రకారమే ఈ ఆలయాలను ధ్వంసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

“చీకటిలో ముసుగులు ధరించిన దుండగులు వాయువ్య బంగ్లాదేశ్​లో 14కు పైగా ఆలయాలను ధ్వంసం చేశారు. దుండగుల వివరాలు మాకు తెలియదు. కానీ వారిని పట్టుకుని అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేస్తున్నాము,” అని థాకుర్​గావ్​లోని బలియాడంగికు చెందిన హిందూ నేత బైద్యనాథ్​ బర్మన్​ మీడియాకు తెలిపారు. మూడు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు వివరించారు.

బంగ్లాదేశ్​లోని హిందూ ఆలయాలపై దాడి చేసిన దుండగులు.. పలు విగ్రహాలను ధ్వంసం చేశారు. మరికొన్నింటిని స్థానికంగా ఉన్న చెరువుల్లో పడేశారు. హిందూ ఆలయాలపై దాడి జరిగిన ప్రాంతాల్లో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.  కాగా.. రెండు వర్గాల ప్రజల మధ్య ఎలాంటి గొడవలు లేవు. అందరూ కలిసికట్టుగానే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నేళ్లు ఇలాంటి ఘటన జరగలేదని, ఎవరు ఈ పని చేసి ఉంటారనేది అర్థం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు.

 వాయువ్య బంగ్లాదేశ్​లోని అనేక గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి- ఆదివారం తెల్లవారుజామున హిందూ ఆలయాలపై దాడి జరిగినట్లు పోలీసులు వివరించారు. “దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు.. పక్కా ప్రణాళికతో ఆలయాలను ధ్వంసం చేసినట్టు కనిపిస్తోంది. నిందితులెవరైనా సరే వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తాము,” అని థాకుర్​గావ్​ పోలీస్​ చీఫ్​ జహంగీర్​ హొస్సెన్​ తెలిపారు. ధ్వంసమైన పలు ఆలయాలను ఆయన సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఒకేసారి 14కు పైగా హిందూ ఆలయాలు ధ్వంసమైన నేపథ్యంలో స్థానిక మైనారిటీ ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

“ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాము. కానీ మాలో భయం మొదలైంది. 14కు పైగా ఆలయాలను ధ్వంసం చేయడం పెద్ద విషయమే. నిందితులను వెంటనే అరెస్ట్​ చేయాలి,” అని సింధూర్​పిండి ప్రాంతానికి చెందిన కాశీనాథ్​ సింగ్​ డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలపై దాడి జరుగుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. కెనడా, అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.

జిల్లా పూజా ఉత్సవాల మండలి ప్రధాన కార్యదర్శి తపన్ కుమార్ ఘోష్ విధ్వసంకు గురైన దేవాలయాలను స్థానిక హిందువులతో కలసి సందర్శించారు. హరిబాసర్ దేవాలయం వద్ద మాట్లాడుతూ సాంప్రదాయకమైన ఈ దేవాలయం చాల పెద్దదని, నిత్యం చాలామంది దర్శిస్తూ ఉంటారని చెప్పారు. అయితే దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం దురదృష్టకరమని చెబుతూ దీనితో స్థానిక ప్రజలు భయకంపితులయ్యారని తెలిపారు.