రాష్ట్రాల ఔషధ నియంత్ర సంస్థలను కేంద్ర సంస్థతో విలీనం చేయాలి

భారతీయ ఔషధాల నాణ్యత ప్రమాణాన్ని నిర్ధారించేందుకు అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్ర సంస్థలను సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌లో విలీనం చేయాలని భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణ ఎల్లా సూచించారు. దేశానికి చెందిన ఔషధాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఇటీవల తమిళనాడుకు చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌కు చెందిన కంటి చుక్కల మందుతో కారణంగా ఒకరు మృతి చెందగా, పలువురు పలు సమస్యలు ఎదురుకావడంతో కంపెనీ చుక్కల మందును రీకాల్‌ చేసింది. గతేడాది గాంబియా, ఉబ్జెకిస్థాన్‌లో భారత్‌లో తయారైన దగ్గు మందుల కారణంగా చిన్నారుల మరణాల కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ కొన్ని విషయాలతో మొత్తం భారతీయ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమను కించపరుచలేమని స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాల్లోనూ నాణ్యతా సమస్యలపై కంపెనీలకు జరిమానాలు విధించారని పేర్కొన్నారు. భారత్‌లో డ్రగ్స్‌కు రెగ్యులేటర్‌ ఉండాలని స్పష్టం చేశారు.  అన్ని రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడి ఎస్ సిఓ)లో విలీనం చేయాలని, దాంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇందుకు రాజకీయ నిర్ణయం, నిబద్ధత అవసరమని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. భారత్‌ బయోటెక్‌కు చెందిన నాసల్‌ వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభమైందని, రెండు రోజుల క్రితమే కొన్ని ఆసుపత్రులకు 3 లక్షల డోసులను పంపినట్లు కృష్ణా ఎల్లా తెలిపారు. విదేశాలకు కూడా ఈ టీకా డోసులను ఎగుమతి చేయడానికి సంసిద్ధమవుతుని వెల్లడించారు. ఈ టీకా కోసం కొన్ని దేశాలు, అంతర్జాతీయసంస్థలు తమ సంస్థను సంప్రదిస్తున్నాయని ఎల్లా తెలిపారు.

బెంగళూరులో ఏర్పాటవుతున్న హెల్త్ సెంటర్ ఈ ఏడాది ఆఖరులో ఆపరేషన్ ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ సెంటర్ ద్వారా భారత్‌కు అవసరమయ్యే మరి కొన్ని కొత్త టీకాల ఉత్పత్తి కోసం పరిశోధనలు, అభివృద్ధి జరుగుతాయని ఎల్లా తెలిపారు.  బెంగళూరులో మాడిసన్‌ వన్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిస్‌-మాడిసన్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ (జి ఎచ్ ఐ), ఎల్లా ఫౌండేషన్‌ మధ్య ఆదివారం ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.

భారతదేశానికి కొత్త వ్యాక్సిన్‌ల అభివృద్ధి, ఉత్పత్తికి ఈ ఆరోగ్య కేంద్రం సహాయపడుతుందని,.భారతదేశంలో పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని వివరించారు. భారతీయ విద్యార్థులు, పరిశోధకులకు యూనివర్శిటీ ఆఫ్ విస్కన్సిన్‌తో అనుసంధానం ఏర్పడి నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుందని ఆయన వివరించారు.

ఎల్లా ఫౌండేషన్‌తో తాము భాగస్వామ్యం పొందడం మరింత శక్తిని పొందినట్టయిందని, విస్కన్సిన్ నుంచి భారత్‌కు యూనివర్శిటీ ఆప్ విస్కన్సిన్ శాస్త్రజ్ఞానం వ్యాప్తి చెంది కొత్త ఆవిష్కరణలకు, పరిశోధనలకు అవకాశాలు చాలా లభిస్తాయని యుడబ్లుమేడిసన్ జిహెచ్‌ఐ డైరెక్టర్ జోర్గె ఒసోరియో చెప్పారు.