నాందేడ్ లో తుస్సుమన్న బీఆర్ఎస్ జాతీయ సభ

మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ తుస్సు మందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మహారాష్ట్ర జనం అసలు పట్టించుకోనేలేదని చెబుతూ 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తెలిపారు.
 
చివరకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుండి ఒక్కొక్కరికి రూ.500లు ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి నాందేడ్ వేదికగా కేసీఆర్ పెద్ద డ్రామా చేశారని అంటూ  తెలంగాణలోనే అతీగతి లేదు.. నాందేడ్ లో బీఆర్ఎస్ ను ఎవరు పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. ‘‘సభలో బీఆర్ఎస్ పార్టీ కాదు మిషన్ అని కేసీఆర్ చెప్పారు. నిజమే బీఆర్ఎస్ ఒక అవినీతి మిషన్.. ఫ్యామిలీ మిషన్.. కమీషన్ల మిషన్” అని విమర్శించారు. 
 
పెద్ద పెద్ద నాయకులు ఎవరెవరో చేరతారని ప్రచారం చేసుకున్నా చివరకు చేరిన అరొకర నాయకులంతా అవుట్ డేటేడ్ వాళ్లే అంటూ ఎద్దేవా చేశారు.   బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం ప్రాతినిధ్యం పెంచుతారట. ప్రతి అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్ లో 1/3 శాతం సీట్లు కేటాయిస్తారట అంటూ నోరు తెరిస్తే అబద్దాలే గదా అని దుయ్యబట్టారు.
 
 మీ తొలి కేబినెట్ లో ఐదేండ్లపాటు ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలేదని అంటూ  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క మహిళకు కూడా ఎందుకు అవకాశమియ్యలేదని నిలదీశారు. అంతెందుకు ఇప్పడున్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లో ఒక్కరైనా మహిళ ఉన్నారా? అని ధ్వజమెత్తారు.
‘‘మహారాష్ట్రలో రైతు  ఆత్మహత్యల గురించి కేసీఆర్ ప్రస్తావించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. తెలంగాణ జనాభాతో పోలిస్తే మహారాష్ట్ర జనాభా మూడు రెట్లు ఎక్కువ. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో సగటున రెండ్రోజులకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇవన్నీ దాచిపెట్టి రైతులను ఉద్ధరిస్తానని కేసీఆర్ చెబుతుంటే… తెలంగాణ రైతులు నవ్వుకుంటున్నారు” అని ధ్వజమెత్తారు.  రైతు బంధు పేరుతో సబ్సిడీలన్నీ బంద్ పెట్టిన కేసీఆర్ మాటలు వింటుంటే.. ‘‘రైతును కత్తితో పొడిచి, అయ్యో నొప్పి ఉందా?’’ అని అడిగినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతటా 24 గంటల కరెంట్ ఇస్తాననడం పెద్ద జోక్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ సభ నిర్వహించిన ప్రాంతానికి కూత వేటు దూరంలోనే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రైతులంతా కనీసం 8 గంటల కరెంట్ అయినా సరఫరా చేయాలని సబ్ స్టేషన్లను ముట్టడిస్తూ, రోడ్లపై ధర్నాలు చేస్తున్నరని గుర్తు చేశారు.
 
మహారాష్ట్రలో పేదలకు అవాస్ యోజన కింద 15 లక్షల 32 వేల 36 ఇండ్లు కట్టించారని పేర్కొంటూ తెలంగాణలో ఎన్ని ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చినవో దమ్ముంటే సీఎం సమాధానం చెప్పాలని సంజయ్ సవాల్ చేశారు.   పారిశ్రామిక రంగంలో మహారాష్ట్ర నెంబర్ వన్. ఫార్మా, ఐటీ రంగాల్లో కూడా మహారాష్ట్ర తెలంగాణాను మించిపోయిందని తెలిపారు.