భారత్ తో వాణిజ్య సంబంధాలకై పాక్ ప్రధానిపై వత్తిడి

అంతర్గతంగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కొంటున్న  నేపథ్యంలో భారత్ తో  వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకై ప్రయత్నించాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రమైన వత్తిడిని ఎదుర్కొంటున్నారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని పాక్‌ వ్యాపారవేత్తలు పాక్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా ఉన్న దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వారు తెలిపారు. 

పాక్‌ ఆర్థిక రాజధాని కరాచీలోని సింధ్‌ ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు ప్రధానికి సూచించారు. రాజకీయ సుస్థిరతతో పాటు ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మార్గాలను అన్వేషించేందుకు ప్రధాని వ్యాపారవర్గాలతో సమావేశం నిర్వహించినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ఖర్చులు, అస్థిరమైన ప్రభుత్వ విధానాలతో వ్యాపారాలు చేయడం ‘దాదాపు అసాధ్యం’ అని ప్రధానికి వ్యాపారవేత్తలు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించిన వ్యాపారవేత్తలు  మరిన్ని చర్యలు అవసమని తెలిపారు.  క్యాపిటల్ మార్కెట్ల దిగ్గజం ఆరిఫ్ హబీబ్ గ్రూప్ అధిపతి ఆరిఫ్ హబీబ్ మాట్లాడుతూ షెహబాజ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు ఒప్పందాలు చేసుకున్నారని, అవి మంచి ఫలితాలే ఇచ్చాయని పేర్కొన్నారు. అలాగే భారత్‌తో వాణిజ్య చర్చలను ప్రారంభించాలని ఆయన ప్రధానికి సూచించారు.

భారత్‌తో వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూ అదే సమయంలో పీటీఐ నేతతో కలవాలని సూచించారు. అయితే, వ్యాపారవర్గాలు సూచించిన వాటిపై ప్రధాని షరీఫ్‌ నేరుగా స్పందించకుండా తప్పించుకున్నారు. ఆర్థిక వృద్ధి కోసం వ్యాపార వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలను ఇస్లామాబాద్‌కు ఆహ్వానిస్తానని మాత్రం చెప్పారు. 

సమస్యలు పరిష్కరించేందుకు చర్చలు జరుపుతామని అంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌ పరిస్థితి తీవ్రంగా దిగజారిందని వాపోయారు. ‘గతంలో మనలో భాగమై తూర్పు పాకిస్థాన్‌గా పిలుకుచుకున్న బంగ్లాదేశ్‌ను భారమని భావించామని, ఇప్పుడు ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసుని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మన వారి వైపు చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది అంటూ ప్రధాని పేర్కొన్నారు.

వచ్చే ఐదేళ్లలో దేశ ఎగుమతులను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు. ఎగుమతుల ఆధార వృద్ధిని సాధించడం ద్వారా విదేశీ మారకద్రవ్య సంక్షోభం నుండి బయటపడేందుకు వ్యాపారులతో సంప్రదించి సమగ్రమైన విధానం రూపిందిస్తామని హామీ ఇచ్చారు.