రూ.100 కోట్ల పిఎంఎల్ఏ కేసులో పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్ 

రూ.100 కోట్ల పిఎంఎల్ఏ కేసులో పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్ 
* రూ 157 కోట్ల విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలలో బ్యాంకు ఖాతాలు, ఆస్తుల జప్తు 
చండీగఢ్‌లోని సెక్టార్ 2లో ఉన్న పంజాబ్ విద్యుత్, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహం, స్థానిక ప్రభుత్వాల శాఖ మంత్రి సంజీవ్ అరోరా అధికారిక నివాసంలో సుదీర్ఘ సోదాల అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను శనివారం అరెస్టు చేశారు. జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేతలు ఆయనకు అండగా నిలిచినప్పటికీ, మనీలాండరింగ్ కేసులో అరోరాను అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. 
 
భగవంత్ మాన్ మంత్రివర్గంలో అత్యంత శక్తివంతమైన మంత్రులలో ఒకరిగా పరిగణించబడే అరోరా, ఆప్ ప్రభుత్వానికి, రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు మధ్య కీలక వారధిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. శనివారం తెల్లవారుజామున ఈడీ అధికారులు అరోరా చండీగఢ్ నివాసానికి చేరుకున్నారు. సుమారు 20 మంది ఈడీ అధికారులు ఎనిమిది వాహనాల్లో వచ్చారు. ఆప్ నాయకుడిపై ఇది మూడవ సోదా. నెల రోజుల లోపే మరో సోదా జరిగింది. 
 
ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్‌లలోని ఐదు ప్రాంగణాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారిక ఈడీ వర్గాలు తెలిపాయి. వీటిలో అరోరా కుటుంబం ప్రమోట్ చేస్తున్న హాంప్టన్ స్కై రియల్టీ లిమిటెడ్ కార్యాలయం, సంజీవ్ అరోరా నివాసం కూడా ఉన్నాయి.  “సంజీవ్ అరోరా తన కంపెనీ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో భాగంగా రూ. 100 కోట్లకు పైగా విలువైన మొబైల్ ఫోన్లను నకిలీ జీఎస్టీ కింద కొనుగోలు చేయడం, ఆ తర్వాత వాటిని ఎగుమతి చేసి దుబాయ్ నుంచి భారతదేశానికి అక్రమ నిధులను తరలించడం వంటివి జరిగాయి” అని ఈడీ అధికారులు తెలిపారు.
 
“నకిలీ ఐటీసీ, ఎగుమతి రుణాలపై జీఎస్టీ రీఫండ్, డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేయడానికి ఢిల్లీలో ఉనికిలో లేని సంస్థల నుంచి అనేక నకిలీ జీఎస్టీ కొనుగోలు బిల్లులు పొందారు. దీనివల్ల ఖజానాకు నష్టం వాటిల్లడంతో పాటు వ్యక్తిగతంగా లాభపడ్డారు,” అని చెప్పారు. ఆరోపిత భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి, ఏజెన్సీ గతంలో అక్టోబర్ 2024లో సంజీవ్ అరోరాతో సంబంధం ఉన్న ప్రాంగణాలపై దాడి చేసింది. తాను విచారణకు సహకరిస్తానని సంజీవ్ అరోరా గతంలోనే తెలిపారు.
 
అయితే, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సోదాల ఆపరేషన్‌ను తీవ్రంగా ఖండించారు. “ఈరోజు మరోసారి బీజేపీకి చెందిన ఈడీ సంజీవ్ అరోరా ఇంటికి వచ్చింది. ఏడాది కాలంలో బీజేపీకి చెందిన ఈడీ ఆయన ఇంటికి రావడం ఇది మూడోసారి. గత నెలలో, రెండవసారి. అయినప్పటికీ, వారికి ఏమీ దొరకలేదు,” అని ఆయన పేర్కొన్నారు. 
మరోవంక, రూ. 157.12 కోట్ల విలువైన నకిలీ ఎగుమతులకు సంబంధించిన విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో,    హాంప్టన్ స్కై రియల్టీ,  మంత్రి సంజీవ్ అరోరాతో సంబంధం ఉన్న సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ హోల్డింగ్‌లు, స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. 
 
ఏప్రిల్ 19న జారీ చేయబడిన ఈ జప్తు ఉత్తర్వులు, ‘విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా), 1999’లోని సెక్షన్ 37(3), ‘ఆదాయపు పన్ను చట్టం’లోని సెక్షన్ 132(9బి) నిబంధనల ప్రకారం జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించడానికి, తదుపరి దర్యాప్తుకు వీలు కల్పించడానికి, ఈ ఆస్తులను 180 రోజుల పాటు స్తంభింపజేయాలని ఈ ఉత్తర్వులు ఆదేశిస్తున్నాయి. 
 
ఏప్రిల్ 17న గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న  హాంప్టన్ స్కై రియల్టీ ప్రాంగణంలో, దాని ప్రధాన వాటాదారు అయిన ఫిండాక్ ఫింవెస్ట్  కార్యాలయాల్లో, అలాగే సంజీవ్ అరోరా, కావ్య అరోరా, హేమంత్ సూద్, చంద్ర శేఖర్‌లకు సంబంధించిన ఇతర ప్రదేశాల్లో ఈడీ నిర్వహించిన సోదాలు, స్వాధీన కార్యకలాపాల పర్యవసానంగా ఈ చర్య జరిగింది. మొత్తం రూ. 
157.12 కోట్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు పేర్కొన్నప్పటికీ, అందులో రూ. 102.50 కోట్ల విలువైన లావాదేవీలు కేవలం రెండు యుఎఈ-ఆధారిత సంస్థలైన ఫోర్టుబెల్ టెలికాం ఎఫ్ జెడ్ కో, డ్రాగన్ గ్లోబల్ ఎఫ్ జెడ్ కో ద్వారానే జరిగాయని ఈడీ ఆరోపించింది.