* దీర్ఘకాల విస్తరణ వ్యూహంలో బీజేపీ… ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే
పంజాబ్ రాష్ట్రంలో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన ప్రత్యర్థులపై స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ విజయావకాశాల్లో ముందంజలో ఉందని పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది.
అయినప్పటికీ 2022 ఎన్నికల తరహాలో ఏకపక్ష తీర్పు కాకుండా ఈసారి ఎన్నికల సమరం పోటీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.పీపుల్స్ పల్స్ డైరెక్టర్ డాక్టర్ రాజన్ పాండే పర్యవేక్షణలో, సీనియర్ పరిశోధకుడు అమిత్ ఓహ్లాన్ సమన్వయంలో జూన్ 20 నుండి జూలై 31, 2026 వరకు (45 రోజుల పాటు) పంజాబ్‌లోని మాల్వా, మాఝా, దోఆబా ప్రాంతాలలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించాయి. పంజాబ్ అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 58 నుండి 63 సీట్లు గెలుచుకుని సాధారణ మేజారిటీ మార్కుకు అతిచేరువగా లేదా స్వల్పంగా దాటే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.
ప్రతిపక్షంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 36 నుండి 43 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉన్నది. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ ( డబ్ల్యూడీ) పార్టీ 4 నుండి 7 సీట్లు గెలుచుకుని గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 నుండి 6 సీట్లు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) 2 నుండి 4 సీట్లు గెలుపొందే అవకాశాలుండగా, ఇండిపెండెంట్లు, ఇతరులు మిగిలిన స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.
పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆప్ 37 శాతం, కాంగ్రెస్ 31 శాతం, వారిస్ పంజాబ్ దే 14 శాతం, బీజేపీ 8 శాతం, శిరోమణి అకాలీదళ్ 6 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలాంటి ముందస్తు పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతాయనే ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందించారు.
2022 నాటి ఏకపక్ష అనుకూల వేవ్ నుంచి పంజాబ్ రాజకీయాలు ఇప్పుడు ప్రభుత్వ పాలనా పనితీరు ప్రాతిపదికగా జరిగే పోరు వైపు మళ్లాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో సాంప్రదాయ పార్టీలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆప్ కు అనుకూల ప్రభంజనాన్ని సృష్టించగా, ఈసారి మాత్రం ఓటర్లు ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగ నిర్మూలన-ఉపాధి కల్పన, వ్యవసాయ విధానాలు, ఆర్థిక నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాజకీయ నాయకుల విశ్వసనీయత ఆధారంగానే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 40 శాతం మంది ఓటర్లు ఆయనకే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంటూ మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి 33 శాతం మంది మద్దతు లభించగా, అమృత్‌పాల్ సింగ్‌కు 13 శాతం మంది మద్దతు తెలిపారు.
ఈ సర్వేలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పట్ల ఉన్న ప్రజాదరణకు, క్షేత్రస్థాయిలోని ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న అసంతృప్తికి మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత తక్కువగా ఉన్నప్పటికీ, అనేక నియోజకవర్గాలలో ఆప్ ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఎన్నికలకు ముందే ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశమిస్తే ఆప్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని ఈ మూడ్ సర్వేలో వెల్లడయింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలమైన గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణాత్మక బలాన్ని కలిగి ఉండి, ఆప్‌కు ప్రధాన సవాలుగా నిలుస్తోంది. కాంగ్రెస్ నాయకుల్లో మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకే అత్యధిక ప్రజాదరణ ఉన్నట్లు ఈ సర్వే వెల్లడయింది.
కాంగ్రెస్ పార్టీ చన్నీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, పార్టీలోని అంతర్గత విబేధాలను నియంత్రిస్తూ సరైన అభ్యర్థులను పోటీలో నిలబెడితే అనేక నియోజకవర్గాల్లో ఆప్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) రాజకీయ ప్రభావం రోజురోజుకీ క్షీణిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. అకాలీదళ్‌కు సాంప్రదాయ ఓటుబ్యాంక్‌గా ఉన్న సిక్కు ‘పంథిక్’ ఓటర్లు, ముఖ్యంగా అమృత్సర్, గుర్దాస్పూర్, తరణ్ తారన్ వంటి సరిహద్దు జిల్లాల్లోని యువ సిక్కు ఓటర్లు వేగంగా ‘వారిస్ పంజాబ్ దే’ వైపు మొగ్గు చూపుతున్నారు.
మత్తు పదార్థ రహిత పంజాబ్, సిక్కు అస్తిత్వ అంశాలపై స్పష్టమైన ప్రచారం చేయడంతో ‘వారిస్ పంజాబ్ దే’ కొన్ని ప్రాంతాల్లో కీలక శక్తిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం పరిమితంగా ఉన్నప్పటికీ, కొన్ని కీలక నియోజకవర్గాల్లో సాంప్రదాయ ఓట్ల విధానాన్ని మార్చడం ద్వారా ఫలితాలను
తలకిందులు చేసే సామర్థ్యం ఈ ఈ పార్టీకి ఉన్నది.
బిజెపి పంజాబ్‌లో తన దీర్ఘకాలిక విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నది. లూథియానా, జలంధర్, అమృతసర్, హోషియార్పూర్, పటియాలా, ఎస్.ఎ.ఎస్ నగర్ (మొహాలి) వంటి ప్రధాన పట్టణ నియోజకవర్గాల్లో పార్టీ ఓటు బ్యాంకు విస్తరించేందుకు కృషి చేస్తున్నది. పట్టణ ప్రాంత హిందూ ఓటర్లు, వ్యాపారులు, చదువుకున్న యువతలో ఆదరణ పెరిగినప్పటికీ, సిక్కు రైతాంగంలో తిరిగి నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడం బీజేపీకి అతిపెద్ద సవాలుగా మిగిలిపోయింది.
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు కొంతమంది ఎంపీలు, ముఖ్య నేతలు ఆప్ ని వీడటం పట్టణ ప్రాంతాల్లో రాజకీయంగా చర్చనీయాంశమైనప్పటికీ, ఎన్నికల ఫలితాలపై దీని తక్షణ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని సర్వే నిర్ధారించింది. డేరా సచ్చా సౌదా, రాధా స్వామి సత్సంగ్ బియాస్, డేరా సచ్ ఖండ్ బల్లాన్, నామ్ధారి , నిరంకారి వంటి డేరాలు పంజాబ్‌లోని మాల్వా, దోఆబా ప్రాంతాల్లో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజికంగా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.
డేరాలు నేరుగా ఏ పార్టీకీ ఓటు వేయాలని ఆదేశాలు ఇవ్వకపోయినా, వారి సామాజిక ప్రభావం దగ్గరగా జరిగే పోటీల్లో ఫలితాలను ప్రభావితం చేస్తుంది. డేరాలతో మెరుగైన సంబంధాల వల్ల బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, అది మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద విజయాన్ని కట్టబెట్టలేదని సర్వే విశ్లేషించింది.
మొత్తంగా చూస్తే, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధాంతాల కంటే ఎక్కువగా ప్రజాపాలన, నాయకత్వ విశ్వసనీయత, అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమస్యల ఆధారంగానే జరగనున్నాయి. ఏకపక్ష ప్రభంజనాలు లేకుండా వందలాది నియోజకవర్గాల్లో హోరాహోరీ స్థానిక పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, సంస్థాగత బలం, ప్రజల అంచనాలకు తగినట్లుగా స్పందించే తీరుపైనే అంతిమ విజయం ఆధారపడి ఉంటుంది.

More Stories
ఆర్ధిక పునర్జీవనంతో జమ్మూ కాశ్మీర్ .. సంక్షోభంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్
భారత్ మయన్మార్‌తో భూభాగ మార్పిడి చేసుకోనుందా?
`మా (1971) విజయమాసం’ డిసెంబర్లో తిరిగి వెళ్లాలనుకుంటున్నాను