ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం

సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుమారు రెండు నెలల తర్వాత దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  వీరిలో ఒక్కరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్ (పివి సంజయ్‌కుమార్) తెలంగాణ వారు. 
సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా ఇప్పుడు పంకజ్ మిత్తల్ (ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) సంజయ్ కరోల్ (ఇప్పుడు పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్) , జస్టిస్ పివి సంజయ్‌కుమార్ (ఇప్పుడు మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్), జస్టిస్ అహసనుద్దిన్ అమానుల్లా (ఇప్పుడు పాట్నా హైకోర్టు న్యాయమూర్తి), జస్టిస్ మనోజ్ మిశ్రా (ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి) నియమితులు అయినట్లు న్యాయమంత్రి రిజిజూ తెలిపారు. వచ్చే వారం వీరు తమ ప్రమాణస్వీకారాలు చేస్తారు.
 
రాష్ట్రపతి ముర్ము వారిని నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు శనివారం ట్వీట్‌ చేశారు. సుప్రీంకోర్టు కొత్త జడ్జీలకు అభినందనలు తెలిపారు.  కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య గత రెండు నెలలుగా సుదీర్ఘమైన వాదోపవాదనలు, చర్చలు జరిగాయి.
 
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల అపాయింట్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఏఎస్ ఓకా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం చీఫ్‌ జస్టిస్‌ సహా 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా ఐదుగురు కొత్తగా నియమితులు కావడంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 32కు పెరిగింది.
జస్టిస్ సంజయ్‌కుమార్ హైదరాబాద్‌లో 1963 ఆగస్టు 14వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు దివంగత పి రామచంద్రారెడ్డి, పి పద్మావతమ్మలకు జన్మించిన సంజయ్‌కుమార్‌ది న్యాయవాదుల కుటుంబం. 1969 నుంచి 1982 వరకూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్‌గా తండ్రి రామచంద్రా రెడ్డి వ్యవహరించారు. పవి కుమార్‌గా పేరొందిన జస్టిస్ సంజయ్‌కుమార్ నిజాం కాలేజీ , హైదరాబాద్ నుంచి బికాం చేశారు. తరువాత 1988లో ఢిల్లీ యూనివర్శిటీలో లా పట్టా తీసుకున్నారు.

న్యాయవాద వృత్తి ఎక్కువగా హైదరాబాద్‌లోనే సాగుతున్న దశలోనే ఆయన తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. తరువాత 201౦లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. 2021లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతితో వెళ్లారు.