ఓ అవివాహిత యువతి గర్భంపై ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో చర్చ

ఓ ఇంజినీరింగ్ చదువుతున్న 20 సంవత్సరాల ఒక అవివాహిత యువతి గర్భం దాల్చడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రహస్యంగా విచారించడమే కాకుండా, ఈ విషయమై తన ఛాంబర్ లో ప్రత్యేకంగా 40 నిమిషాల సేపు చర్చ జరిపి, ఒక సానుకూలమైన పరిష్కారం కనుగొన్నారు.

ఆ యువతీ గర్భం 29 వారాలు దాటిన తరువాత అబార్షన్ చేసుకోవాఅయితే నిర్ణయించుకుంది. అయితే, చట్ట ప్రకారం అది సాధ్యం కాదు కనుక అసాధారణ కేసుగా భావించి తన అబార్షన్ కు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించింది. అయితే, పిండం వయస్సు 29 వారాలు ముగిసిన ఈ సమయంలో అబార్షన్ తల్లికి, బిడ్డకు క్షేమం కాదని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అప్పటికే స్పష్టం చేసింది.

తన గర్భం విషయం తన కుటుంబానికి, ఇతర బంధు మిత్రులకు తెలియదని, అందువల్ల రహస్య విచారణ జరపాలని ఆ యువతి విన్నవించుకున్న కారణంగా, ఈ కేసు విచారణ రహస్యంగా జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పడివాలా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించింది.

అనంతరం, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిలను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తన చాంబర్ పిలిపించారు. వీరందరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చ కొనసాగింది. ఆ యువతి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ బిడ్డను దత్తత తీసుకోవడానికి ఒక జంట సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనానికి వెల్లడించారు.

 బిడ్డ పుట్టిన తరువాత నిబంధనల ప్రకారం ఆ బిడ్డను వారికి దత్తతకు ఇవ్వవచ్చని వివరించారు. ఇదంతా కూడా రహస్యంగా చేయవచ్చని చెప్పారు. ఈకేసు విషయమై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చాలా ఆందోళన చెందారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సీజేఐ  స్వయంగా ఇద్దరు దివ్యాంగులైన బాలికలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసు విషయం తన ఇంట్లో కూడా చర్చించినట్లు జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. గర్భం దాల్చిన ఆ యువతి తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నానని ఏఎస్జీ ఐశ్వర్య భాటి ధర్మాసనానికి తెలిపారు. అవసరమైతే, బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డను పెంచుకోవడానికి తాను సిద్దమేనని ఆమె చెప్పారు.

ఈ పరిస్థితుల్లో అబార్షన్ కు అంగీకరించకూడదని నిర్ణయించిన ధర్మాసనం.. బిడ్డ జన్మించే వరకు తల్లీబిడ్డల ఆరోగ్యం బాధ్యతను ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు అప్పగించింది. రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తమకు లభించిన అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ జన్మించిన అనంతరం, నిబంధనల ప్రకారం ఆ బిడ్డను దత్తతకు ఇవ్వాలని నిర్ణయించారు.