ఓ మహిళను వేధించారన్న ఆరోపణలపై రాజస్థాన్ మంత్రిపై కేసు

ఆస్తివివాదంలో తన సొంత నియోజకవర్గమైన సికార్‌లోని ఓ మహిళను వేధించారన్న ఆరోపణలపై రాజస్థాన్‌ హోంగార్డ్‌, పౌర రక్షణమంత్రిశాఖా మంత్రి రాజేంద్ర సింగ్‌ గూడాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు నమోదవ్వడంపై మంత్రి రాజేంద్రసింగ్‌ సిఎం ఆశోక్‌గెహ్లాట్‌పై మండిపడ్డారు.

సిఎం ఆదేశాల మేరకే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని మంత్రి  విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హోంశాఖ అనేది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉంటుంది. అలాంటిది ముఖ్యమంత్రికి ఎలాంటి సమాచారం లేకుండా నాపై కేసు నమోదు కాదు. ఈ కేసు గురించి నేను సిఎంని వ్యక్తిగతంగా కలిసి ఆయనతో మాట్లాడతాను’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, గతంలో బిఎస్‌పి (బహుజన్‌ సమాజ్‌ పార్టీ) పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజేంద్ర సింగ్‌ గూడా కాంగ్రెస్‌ పార్టీలోకి మారారు. అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌కి, సచిన్‌పైలట్‌కి మధ్య జరుగుతున్న వార్‌లో రాజేంద్రసింగ్‌ సచిన్‌పైలట్‌కే మద్దతుగా ఉన్నారు. దీంతో అశోక్‌గెహ్లాట్‌ తనని టార్గెట్‌ చేశారని మంత్రి రాజేంద్రసింగ్‌ విమర్శిస్తున్నారు.

అయితే మంత్రి ఆగ్రహంపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించలేదు. ఈ మంత్రి కేసును దర్యాప్తు కోసం క్రైమ్‌ బ్రాంచ్‌, సిబి-సిఐడికి అప్పగించింది. జనవరి చివరి వారంలో ఆస్తివివాదంపై మంత్రి రాజేంద్రసింగ్‌ తనను ఫోన్‌లో దుర్భాలాషడారని, ఇంటి నుంచి తనను బలవంతంగా తీసుకెళ్లి బ్లాంక్‌చెక్‌పై సంతకం చేయించేందుకు ప్రయత్నించారని బాధితురాలు దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.