కర్ణాటకలో 130 నుంచి 140 సీట్లలో మళ్ళీ అధికారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 130 నుంచి 140 సీట్లను గెలుపొంది మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని, ఎవ్వరూ దానిని ఆపలేరని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ‘నేనే సీఎం’ అంటూ కాంగ్రెస్‌లో విభేదాలు మొదలయ్యాయని, అసలు కాంగ్రెస్ లీడర్ ఎవరు? రాహుల్ గాంధీనా అని ఆయన ఎద్దేవా చేశారు.

బెంగళూరులో శనివారంనాడు జరిగిన బీజేపీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ ఏప్రిల్ 10-12 తేదీలలోగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని చెబుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు కారణంగా బిజెపి సొంతంగానే పూర్తి మెజారిటీ సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీలో ఎటువంటి గందరగోళం లేదని, అందరూ సమైక్యంగా ఉన్నారని చెబుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను ఇంటింటికి తీసుకు వెళ్లడం ద్వారా మహిళలు, యువకులు, ఎస్సి, ఎస్టీల మద్దతు కూడదీసుకొనేందుకు పార్టీ శ్రేణులు ద్రుష్టి సారించాలని ఆయన కోరారు. ధనబలం, కండబలం, మత రాజకీయాలను ఉపయోగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రోజులు పోయాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాల కార్యక్రమాలు అందుకొని ఇల్లంతా లేదని పేర్కొంటూ, ఈ నెల 17న ప్రవేశపెట్టే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో ప్రజానుకూల పలు అంశాలను ఉండే అవకాశం ఉన్నదని కూడా తెలిపారు.

కర్ణాటక ఎన్నికల ఇన్‌చార్జులుగా ధర్మేంద్ర ప్రధాన్, అన్నామలైలను పార్టీ అధిష్ఠానం నియమించిందని, అన్నామలై కూడా సమర్ధులని, ధర్మేంద్ర ప్రధాన్ చాలా సీనియర్ నేత అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు పార్టీ అధిష్ఠానం నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు బెంగళూరులో ఈ సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది.

అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతను సమీక్షించడం, ఇందుకు అనుగుణంగా వరుస కార్యక్రమాలను ప్లాన్ చేయనుంది. రథయాత్ర తేదీలను బీజేపీ కీలక వ్యూహకర్త బీఎల్ సంతోష్‌ ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని నాలుగు వైపుల నుంచి రథయాత్రలను ప్రారంభిస్తారు. తద్వారా ఎన్నికల ప్రచార ఉధృతిని బీజేపీ మరింత పెంచనుంది.

విజయ సంకల్ప యాత్ర, బూత్ విజయ అనే రెండు ప్రధాన ప్రచార కార్యక్రమాలను పార్టీ ప్లాన్ చేస్తోంది. బూత్ ప్రచార్ తర్వాత వివిధ వర్గాల నుంచి వచ్చిన స్పందనను పరిగణనలోకి తీసుకుని తదుపరి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని పార్టీ ఖరారు చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి అరుణ్ సింగ్ సైతం బెంగుళూరు చేరుకున్నారు.

ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల సన్నద్ధతను ఆయన సమీక్షించనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కర్ణాటకకు గరిష్టంగా లబ్ధి చేకూరిందని, అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కోసం రూ.5,300 కోట్ల గ్రాంట్ మంజూరైందని ఆయన మీడియాకు తెలిపారు. వివిధ రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తోందని చెప్పారు.

కర్ణాటక ఎన్నికల ఇన్‌చార్జీగా ధర్మేంద్ర ప్రధాన్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బీజేపీ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ ను కేంద్ర పార్టీ నియమించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలైను కర్ణాటక కో ఇన్‌చార్జీగా నియమించింది. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో పలు ఎన్నికల ఇన్ చార్జీగా పనిచేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జీగా ప్రధాన్ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. గతంలో కేంద్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటక ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించారు.