ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయని వాణీజయరాం (78) కన్నుమూశారు. ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్‌బక్కమ్‌లోగల హడ్డోస్‌ రోడ్డులో అమె నివసిస్తున్నారు. ఆమె తన ఇంట్లోనే జారిపడి చనిపోయినట్లు తెలుస్తున్నది. ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న వాణిని స్థానికుల సహాయంతో పనిమనిషి ఆస్పత్రికి తరలిస్తుండగా లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
 
వాణీ జయరాం దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్య గాయకురాలు. వాణీజయరామ్ అసలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న వాణీ జయరాం జన్మించారు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఐదో సంతానమై ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు.
 

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు.  అంతే కాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడారు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీజయరాం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు.

ఎస్‌పి కోదండపాణి స్వరకల్పనలో ఆమె పాడిన తొలి పాట ఎప్పటివలెకాదురా నా స్వామి శ్రోతలను ఆకట్టుకుంది. ఆ తర్వాత 1975లో రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన పూజ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. పూజలు చేయ పూలు తెచ్చాను, ఎన్నెన్నో జన్మల బంధం వంటి పాటలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి.

కె విశ్వనాథ్ దర్శకత్వంలో చరిత్ర సృష్టించిన శంకరాభరణం చిత్రంలో వాణి జయరాం ఐదు పాటలు పాడారు. అనంతర కాలంలో విశ్వనాథ్ దర్శకత్వంలో వెలువడిన శృతిలయలు, స్వాతి కిరణం తదితర అనేక చిత్రాలలో వాణి జయరాం అద్భుతమైన పాటలు పాడారు.  స్వాతి కిరణం చిత్రం ఆమెకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును కూడా తెచ్చింది. కెవి మహదేవన్, రాజన్ నాగేంద్ర, సత్యం, చక్రవర్తి, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా వంటి దిగ్గజ సంగీత దర్శకత్వంలో ఆమె వందలాది పాటలు పాడారు.

ఆమె సేవలకు గుర్తింపుగా ఉత్తమ నేపథ్య గాయని విభాగంలో మూడుసార్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు. అంతేగాక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, ఒడిశా తదితర రాష్ట్రాలు కూడా ఆమెను అవార్డులతో సత్కరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వాణీ జయరాంకు పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది.

వాణి జయరాం మరణంపై పలు అనుమానాలు!

వాణి జయరాం మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణమేనా లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వాణి జయరాం ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మహిళ ఫ్లాట్‌ తలుపుతట్టగా లోపలి నుంచి స్పందన లేదు. ఆమె ఐదుసార్లు కాలింగ్‌ బెల్‌ కొట్టినా తలుపు తీయలేదు.
దాంతో పనిమనిషి భర్త తన ఫోన్‌లోంచి వాణీ జయరాం ఫోన్‌కు కాల్‌ చేశాడు. అయినా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్‌ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టించింది. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్టుగా తీవ్ర గాయాలున్నాయి.

వెంటనే పనిమనిషి, స్థానికులు కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు. పనిమనిషి, స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్‌లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.