అదానీపై వివాదం వద్దు… మదుపరుల విశ్వాసం దెబ్బతింటుంది

దేశీయ స్టాక్‌మార్కెట్లు చక్కటి నియంత్రణలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వివాదం వద్దని ఆమె హితవు చెప్పారు. దానివల్ల మదుపరుల విశ్వాసం దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు.

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ గ్రూప్ నివేదిక వెలువడ్డాక అదానీ గ్రూప్ మొత్తం పెట్టుబడిలో 120 బిలియన్ డాలర్లకుపైగా సంపద తుడిచిపెట్టుకుపోయింది. అదానీ గ్రూప్ స్టాక్ మాన్యిపులేషన్‌కు, మోసాలకు పాల్పడ్డాయని ఆ రీసెర్చ్ సంస్థ ఆరోపించింది. అయితే అదానీ గ్రూప్ మాత్రం హిండెన్‌బర్గ్ రిపోర్టును నిరాధారం, తప్పులతడక అని కొట్టిపారేసింది.

ప్రకంపనలు సృష్టిస్తున్న ఆదానీ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక మంత్రి మొదటిసారిగా స్పందిస్తూ దేశ ఆర్థిక రంగం సజావుగా సాగుతోందని తేల్చి చెప్పారు.  ఒక్క సంఘటన, దానిపై అంతర్జాతీయంగా ఎంత ప్రచారం జరిగినా సరే, ఆ ఒక్క సంఘటన ఆధారంగా దేశ ఫైనాన్షియల్ మార్కెట్ల నిర్వహణపై నిర్ధారణకు రావడం సరికాదని ఆమె హితవు చెప్పారు. ‘ఒక్క విషయం ప్రపంచవ్యాప్తంగా ఎంతగా రచ్చ అయినప్పటికీ, అది చక్కని నియంత్రణలో ఉన్న భారతీయ ఆర్థిక మార్కెట్‌ను ప్రభావితం చేయలేవు’ అని నిర్మల భరోసా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక రంగ నిర్వహణ సమర్ధవంతంగా, సజావుగా సాగుతోందని, ఆందోళన అక్కర్లేదని ఆమె చెప్పారు. 

ఆదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ, ఎస్బీఐలు భారీగా పెట్టుబడులు పెట్టిన విషయంపై  అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అనుమతించిన పరిమితికి లోబడే ఆ పెట్టుబడులున్నాయని ఆమె తెలిపారు. ఇప్పటికే ఆ విషయమై ఎల్ఐసీ, ఎస్బీఐ సవివరమైన ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  అదానీ గ్రూపుకు ఆర్థిక రంగంలోని ప్రభుత్వ సంస్థలు పరిమితంగానే ఎక్స్‌పోజర్‌నిచ్చాయని, అవి క్రాష్‌కు మూలకారణం కావని ఆమె స్పష్టం చేశారు. 
‘మదుపరుల విశ్వాసం ఇప్పటికీ ఉందని, అది కొనసాగుతుందని నమ్ముతున్నాను’ అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.  దేశీయ బ్యాంకింగ్ రంగం గురించి ఎలాంటి అనుమానాలుకానీ భయాందోళనలు కానీ అవసరం లేదని నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు. దేశీయ బ్యాంకింగ్ రంగం సజావుగా, సమర్ధవంతమైన నిర్వహణలో సాగుతోందని ఆమె స్పష్టంచేశారు.
 
 ఆదానీ వివాదంపై అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రచారంపై నిర్మల ప్రస్తావిస్తూ భారతదేశ నియంత్రణ సంస్థలు అత్యంత నిపుణులైన వ్యక్తుల నిర్వహణలో ఉన్నాయని, కఠిన నిబంధనలను అమలు చేస్తూ, ఎలాంటి అవకతవకలకు అవకాశంలేకుండా పని చేస్తున్నాయని ఆమె వివరించారు.  ఆదానీ అవకతవకల ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఒకటో, అరో ఘటనల ఆధారంగా వాటి పని తీరుపై అంచనాకు రాకూడదని నిర్మల సీతారామన్  సూచించారు.
ఆదానీ సంక్షోభం కొనసాగుతున్న సమయంలోనూ, బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్లు పైపైకి వెళ్లిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇలా ఉండగా, పార్లమెంటులోని ఉభయసభలు…లోక్‌సభ, రాజ్యసభ శుక్రవారం రెండో రోజున కూడా వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు అదానీ అంశాన్ని లేవనెత్తి విచారణకు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ పర్యావసనం చోటుచేసుకుంది. ఉభయ సభలు తిరిగి సోమవారం అంటే ఫిబ్రవరి 6న సమావేశం కానున్నాయి.