గవర్నర్ తో తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించారు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్  అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చేయని వివిధ కార్యక్రమాలను గొప్పగా చేసినట్లుగా చెప్పుకోవడం ప్రభుత్వ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకుని గొప్పులు చెప్పుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. తెలంగాణ గ్రామాల రుపురేఖలు మారాయని అసెంబ్లీలో గవర్నర్‌తో చదివించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు అందక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని విస్మరించిందని పేర్కొన్నారు.

గవర్నర్ ప్రసంగంపై మొదట రాజకీయంగా అనవసర రాద్ధాంతం చేసిన ప్రభుత్వం, కోర్టు జోక్యంతో మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గవర్నర్ ప్రసంగానికి సిద్ధమైందని ఎద్దేవా చేశారు. ఇటీవలి కాలంలో జై తెలంగాణ నినాదాన్ని సీఎం కేసీఆర్ విస్మరించినా.. రాష్ట్ర గవర్నర్ తన ప్రసంగాన్ని జై తెలంగాణ అని చెప్పి ముగించడం రాష్ట్ర ప్రజల పట్ల ఆమెకు ఉన్న ఆదరాభిమానాలకు నిదర్శనమని కిషన్ రెడ్డి కొనియాడారు. 

పాడుబడ్డ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్ తో  చదివించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధికి సర్పంచ్‭లకు బిల్లులు ఇయ్యని విషయం మరిచిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారిమళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడాన్ని బడ్జెట్లో ప్రస్తావించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకతతో అనేక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సభ్యులు అవిశ్వాస తీర్మానాల కోసం అధికారులకు నోటీసులు ఇస్తున్న విషయం ప్రజలకు తెలుసని ఆయన తెలిపారు. ప్రభుత్వ కృషితో రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం 16 వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన విషయాన్ని మర్చిపోయిందని విమర్శించారు.

2014 -15లో రాష్ట్ర ఆదాయం రూ. 62వేల కోట్లు ఉంటే, ప్రభుత్వ కృషితో 2021 నాటికి రూ. లక్ష 84 వేల కోట్లకు పెరిగిందని గవర్నర్ తో చెప్పించిన ప్రభుత్వం రూ.16 వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దాదాపు రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన విషయాన్ని మరిచిందా? అని ప్రశ్నించారు.

 రైతుబంధు నిజమైన లబ్ధిదారులకే వస్తుంటే ఈ ఎనిమిదేండ్లలో వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని కిషన్ రెడ్డి నిలదీశారు. కేంద్రం నిధులతో చేపట్టిన అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని కేంద్ర మంత్రి విమర్శించారు. నోటిఫికేషన్లతోనే సరిపెడుతూ ఉద్యోగ కల్పనపై అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు.

ప్రజలకు అవాస్తవాలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతిని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని చెప్పిన హామీని, దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి విషయాన్ని, హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తామన్న ప్రకటనను విస్మరించిన వాస్తవాలను కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేసే ఉంటే బాగుండేదని కిషన్ రెడ్డి హితవు చెప్పారు.