తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లు

ఈ ఏడాది రికార్డు స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేశామని  కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 8,406 కోట్ల మేర కేటాయింపులు జరిగాయని గణాంకాలు వెల్లడించారు. 2009-2014 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మొత్తం కేటాయింపులు కేవలం రూ. 886 కోట్లు మాత్రమేనని, కానీ ఈ ఒక్క ఏడాదికే ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపామని వెల్లడించారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిపిన కేటాయింపుల్లో రైల్వే లైన్ డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా ఉన్నాయని చెప్పారు.  అలాగే చాలా చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)లు, రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మోడల్ రైల్వే స్టేషన్లు వంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
 
వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ పేరుతో జియో ట్యాగింగ్ చేసిన వస్తువులతో పాటు రోజువారీ వస్తువులు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పొందుపర్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కేంద్ర మంత్రిని ప్రశ్నించగా.. చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉందని, ఆ మేరకు పరిశీలించి ప్రత్యామ్నాయంగా రైల్వే ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీని మంజూరు చేశామని వివరించారు. త్వరలోనే టెండర్లను పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
  విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం
 
విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం కానున్నాయని రైల్వే మంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో జోనల్ భవనాల కార్యాలయాల నిర్మాణం కోసం కేంద్రం రూ. 10 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇందుకోసం రూ. 40 లక్షలు మాత్రమే కేటాయింపులు జరిగాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌, రాయగడ డివిజన్‌కు కలిపి బడ్జెట్‌లో రూ. 10 కోట్లు కేటాయించినట్టు రైల్వే పింక్ బుక్‌లో పేర్కొంది.
 
మొత్తం రూ. 170 కోట్ల అంచనాతో కొత్త జోన్‌ ఏర్పాటుకు 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసింది. 2021-22 బడ్జెట్‌లో రూ. 8 లక్షల ఖర్చు చేయగా, 2022-23లో రూ. 40 లక్షలు కేటాయించింది. జోనల్ హెడ్‌క్వార్టర్స్ భవనాలకు తగిన స్థలం ఖరారైందని, ఈ మధ్యనే తాను ఆ స్థలాన్ని స్వయంగా పరిశీలించానని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
 
తెలంగాణకు 45 శాతం ఎక్కువగా నిధులు
తెలంగాణలో గత బడ్జెట్ కంటే ఈసారి 45 శాతం బడ్జెట్‌ను పెంచినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. తెలంగాణకు ఒక్క ఏడాదికే రూ. 4,418 కోట్లు కేటాయింపులు జరిగాయని వెల్లడించారు.  హైదరాబాద్‌లో డబ్లింగ్, త్రిబ్లింగ్ పనులకు రూ. 600 కోట్లు కేటాయించినట్టు జైన్ వివరించారు. రెండో దశ ఎంఎంటీఎస్‌ కోసం 600 కోట్లు నిధులు కేటాయించినట్టు పేర్కొన్నారు.
 
చర్లపల్లి టెర్మినల్ కోసం రూ. 82 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కాజీపేట- బలహర్ష మార్గంలో థర్డ్ లైన్ పనులకు రూ. 450 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.  అకొల- డోన్ మార్గంలో డబ్లింగ్ పనుల కోసం రూ. 60 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కాజీపేట – విజయవాడ థర్డ్ లైన్ పనులకు రూ. 337 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. మరోవైపు బైపాస్ లైన్ల కోసం రూ.383.12 కోట్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ. 125 కోట్ల నిధులు కేటాయించినట్టు జైన్ వెల్లడించారు.
పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుదీకరణ
 
తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రైల్వే లైన్ల విద్యుదీకరణలో భాగంగా పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుదీకరణ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రైల్వేశాఖ చేసిన ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు. ఈ సందర్భంగా దీని వల్ల ప్రయోజనం పొందే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలకు అభినందనలు అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
మిషన్ విద్యుద్దీకణలో భాగంగా ఈ ప్రత్యేక విస్తరణ ద్వారా మూడు రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుందని మోదీ తెలిపారు. పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుదీకరణ ప్రాజెక్ట్‌ను రైల్వేశాఖ ప్రకటించింది. లాతూర్ రోడ్-పర్లీ వైజ్‌నాథ్ మార్గంలో 268 కి.మీ మార్గం మొత్తం ఇప్పుడు విద్యుదీకరించబడుతుందని రైల్వేశాఖ ట్విట్టర్‌లో పేర్కొంది.