ఇది పేద, మధ్య తరగతి ప్రజల కలలు నెరవేర్చే బడ్జెట్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అమృతకాలంలో ప్రవేశపెట్టి మొదటి బడ్జెట్.. అభివృద్ధి భారత్ కలను నెరవేర్చడానికి సహకరిస్తుందని అన్నారు. దేశాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని మోదీ చెప్పారు.  ఈ బడ్జెట్ రైతులు సహా అన్ని వర్గాల ప్రజల కలను నెరవేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.
గ్రామీణ, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని, పన్నుల తగ్గించి ఉపశమనం కలిగించామని చెప్పారు. మహిళా సాధికారికత కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టామని మోదీ పేర్కొన్నారు.  ‘‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల జీవనం కోసం పలు చర్యలు తీసుకున్నాము. ఇవి మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత మెరుగుపరుస్తాయి.. మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించనున్నాం’’ అని మోదీ తెలిపారు.
విశ్వకర్మలకు తొలిసారి శిక్షణ, సహాయక పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టామని అన్నారు. మన తృణధాన్యాలకు ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు ఉందని, ఇప్పుడు ఈ ‘సూపర్ ఫుడ్’కు ‘శ్రీ అన్న’ అనే పేరుతో కొత్త ఐడెంటిటీ కల్పించామన్నారు. ఇందువల్ల సేద్యం చేసే చిన్నకారు రైతులు, గిరిజనులు స్త్రీ, పురుషులకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్నారు. మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించే పలు చర్యలు కూడా బడ్జెట్‌లో తీసుకున్నామని, పన్నుల రేట్లు తగ్గించామని, తగిన ఉపశమనం కల్పించామని ప్రధాని చెప్పారు. ఇందువల్ల మధ్యతరగతి ప్రజలు మరింత మెరుగైన జీవనం సాగించగలరని చెప్పారు.
 
అలాగే, ఈ బడ్జెట్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ జాబ్‌లను మరింత ప్రోత్సహించే స్థిరమైన భవిష్యత్తు కోసం సహకరిస్తుందని వివరించారు. తాము బడ్జెట్‌లో సాంకేతికత, కొత్త ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించామని తెలిపారు. ‘‘మధ్యతరగతి ప్రజల సాధికారత, జీవన సౌలభ్యం కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మేము పన్ను రేటును తగ్గించాం.. తదనుగుణంగా ఉపశమనం ఇచ్చాం’’ అని మోదీ స్పష్టం చేశారు.
5 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి దిశలో

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఈ బడ్జెట్‌తో దేశంలో సకారాత్మక  మార్పులు వస్తాయని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు అభివృద్ధి చెందాలనే మన లక్ష్యం దిశగా ఈ మార్పులు నడిపిస్తాయని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడాన్ని, పన్ను స్లాబులను సవరించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ పరిమితిని ప్రస్తుత రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమాలపై దృష్టి సారించిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. రైతులు, మహిళలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతి ప్రజలకు ప్రాధాన్యం లభించిందన్నారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కన్నా 13 శాతం ఎక్కువ.

నారీ శక్తి సాధికారత కోసం … 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  మాట్లాడుతూ, నారీ శక్తి సాధికార దేశాన్ని ఏ విధంగా నిర్మించగలదో ఈ బడ్జెట్ స్పష్టం చేసిందని తెలిపారు. ఈ బడ్జెట్‌ను రూపొందించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఓ మహిళ అనే విషయాన్ని స్మృతి ఇరానీ పరోక్షంగా ప్రస్తావించారు. బాలలు, వయోజనుల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆమె స్వాగతించారు.
 
ఇది మధ్య తరగతి బొనాంజా బడ్జెట్ అని స్మ్రితి ఇరానీ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమ్మిళిత అభివృద్ధి గురించి ప్రాధాన్యత ఇచ్చారణ చెప్పారు. ఇది సమ్మిళిత బడ్జెట్ అని ఆమె పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, వృద్ధులు… ఇలా అందరికీ ఈ బడ్జెట్‌లో స్థానం కల్పించారని ఆమె తెలిపారు.