వార్షిక బడ్జెట్ లో దేశ రక్షణ రంగానికి భారీగా ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కేటాయింపులు జరిపారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.94 లక్షల కోట్లను కేటాయించారు. గతంతో పోల్చుకుంటే రక్షణ రంగానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల మొత్తం 13.31 శాతం అధికం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొత్తం బడ్జెట్ లో 13 శాతం వాటా రక్షణ రంగానిదే. రక్షణ రంగాన్ని ఆధునికీకరించడంలో భాగంగా ఈ మేరకు భారీ కేటాయింపులు చేయాల్సి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అత్యాధునిక ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవడానికి వీలుగా ఈ కేటాయింపులు ఉన్నాయి. ఒక పక్క చైనా, మరోపక్క పాకిస్తాన్ నుంచి సవాళ్లు పెరిగిపోతుండడం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల దృష్ట్యా రక్షణరంగ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రాధాన్యత ఇచ్చింది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న రాఫెల్ యుద్ధ విమానాలను మరిన్ని కొనుగోలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి కొనుగోలు చేయాల్సిన ఏకే 203 రైఫిళ్లకూ ఇందులో మెజారిటీ వాటా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
రక్షణరంగం తర్వాత రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖకు రూ.2.70 లక్షల కోట్లను కేంద్రం ప్రకటించింది. ఇక రైల్వే మంత్రిత్వశాఖకు రూ.2.41 లక్షల కోట్లు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీల శాఖకు రూ.2.06 లక్షల కోట్లు, కేంద్ర హోంమంత్రిత్వశాఖకు రూ.1.96 లక్షల కోట్లు, ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖకు రూ.1.78 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.60 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు రూ.1.25 లక్షల కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్‌కు రూ.1.23 లక్షల కోట్లు చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్ 2023-24లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.
దేశంలోని అగ్రి స్టార్టప్‌లకు సహాయం చేయడానికి అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు సహాయం అందించే ప్యాకేజీగా ప్రధానమంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్‌ను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. తమ ఉత్పత్తుల నాణ్యత మెరుగుపరుస్తామని, ఈ వ్యాపారవేత్తలను ఎంఎస్ఎంఈ వాల్యూ చైన్‌తో అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. దీంతో.. టీవీలు, మొబైళ్లు, కెమెరాలు, లెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. లిథియం బ్యాటరీలపై 21 నుంచి 13శాతానికి కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని కేంద్ర బడ్జెట్‌తో స్పష్టమైనప్పటికీ కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనుండటం కూడా గమనార్హం.
టైర్లు, సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సిగరెట్లపై 16 శాతం పన్ను పెంపుతో ధరలు పెరగనున్నాయి. వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో బంగారం, వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. బ్రాండెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెరగనుంది. వీటితో పాటు మరికొన్ని వస్తువుల ధరలపై కేంద్ర బడ్జెట్ ప్రభావం ఏమేర ఉండబోతోందో తెలుసుకోండి..
ధరలు తగ్గనున్న వస్తువులివే..
* మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ల విడి భాగాల ధరలు, టీవీ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు.
ధరలు పెరగనున్న వస్తువులివే..
* గోల్డ్ బార్స్ నుంచి తయారయ్యే బంగారు ఆభరణాలు, సిగరెట్లు, వెండి, ఇమిటేషన్ జువెలరీ (గిల్ట్ నగలు), ఎలక్ట్రానిక్ కిచెన్ చిమ్నీ, దిగుమతి చేసుకుని అమ్మే బొమ్మలు, సైకిల్స్, దిగుమతి చేసుకుని విక్రయించే ఎలక్ట్రానిక్ వాహనాలు
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు