జనవరిలో రూ.1.55 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

జనవరి నెలలో అత్యధిక మొత్తంలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఈ నెలలో రూ.1,55,922 కోట్ల జీఎస్టీ వసూలు చేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు జనవరి నెల జీఎస్టీ వసూళ్లు రూ.1,55,922 కోట్లుగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఇది ఇప్పటివరకు రెండో అత్యధిక వసూళ్లుగా ఆర్థిక నిపుణులను పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది మూడోసారి.  ఇందులో రూ.28,963 కోట్లు కేంద్రం జీఎస్టీ వసూళ్లు ఉన్నాయి. రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ. 36,730 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు రూ.79,599 కోట్లు ఉన్నాయి.
 
కాగా, రూ. 37,118 కోట్లు వస్తువుల దిగుమతి ద్వారా, రూ.10,630 కోట్లు సెస్‌గా వసూలు చేశారు. ఇంతకు ముందు 2022 ఏప్రిల్‌ నెలలో ఇంత కంటే ఎక్కువ జీఎస్టీ వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల వరకు వచ్చిన ఆదాయాలు గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే 24 శాతం ఎక్కువగా ఉన్నాయి.
 
వస్తువుల దిగుమతుల ద్వారా ఈ కాలానికి వచ్చిన ఆదాయాలు 29 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. అలాగే, దేశీయ లావాదేవీల ఆదాయం (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఆదాయాల కంటే 22 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2022 డిసెంబర్ నెలలో 8.3 కోట్ల ఈ-వే బిల్లులు జనరేట్‌ అయ్యాయి. ఇది ఇప్పటివరకు అత్యధికం.
నవంబర్‌ నెలలో రూపొందిన ఈ-వే బిల్లల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. నవంబర్ 2022లో 7.9 కోట్ల ఈ-వే బిల్లులు జనరేట్‌ అయ్యాయి. నెలాఖరు వరకు జీఎస్టీ రిటర్న్‌ల, ఇన్‌వాయిస్‌ల స్టేట్‌మెంట్‌ దాఖలు శాతం సంవత్సరం చివర్లో గణనీయంగా మెరుగుపడింది. 2022 అక్టోబర్- డిసెంబర్‌ త్రైమాసికంలో 2.42 కోట్ల జీఎస్టీ రిటర్న్‌లు దాఖలయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో కేవలం 2.19 కోట్లు వచ్చాయి.