`ఘర్ వాపసీ’లకు మతమార్పిడి చట్టం వర్తించదు

వివిధ ప్రలోభాల కారణంగా ఇతర మతాల్లోకి వెళ్లిన వారు హిందూ మతంలోకి రావాలనుకుంటే స్వేచ్ఛగా రావొచ్చని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఘర్ వాపసీ చేసుకునేవారు తిరిగి హిందువులుగా జీవించవచ్చని తెలిపారు. అటువంటి వారిపై మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టం వర్తించదని ఆయన తేల్చి చెప్పారు.

మహారాష్ట్ర జల్‌గావ్ జిల్లా జామ్‌నెర్‌లో జరుగుతున్న బంజారా కుంభ్ 2023 కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మత మార్పిడులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం రూపొందించిన చట్టం 2020 నవంబర్ నుంచే యూపీలో అమల్లో ఉందని చెప్పారు. ఎవరినీ బలవంతంగా మతం మార్చరాదని, అలా చేస్తే పదేళ్ల జైలు తప్పదని ఆదిత్యనాథ్ హెచ్చరించారు. 

సనాతన ధర్మ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతమని చెబుతూ దానిపై దాడి చేయడం అంటే మానవత్వంపై దాడి చేయడమే అని స్పష్టం చేశారు. దేశంలో మత మార్పిడులను ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని బలహీనపరచడానికి మనదేశంలో ఉంటూ ప్రయత్నిస్తున్న వారి ఆటలు సాగనీయబోమని హెచ్చరించారు. ఇటీవల ఢిల్లీలోని మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చడాన్ని ప్రస్తావిస్తూ విదేశీయుల అణచివేత గుర్తులను చెరిపి వేయడం కోసం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగమని తెలిపారు.

కాగా, కులాన్ని, ప్రాంతీయవాదాన్ని పక్కనపెడితే ప్రపంచంలో ఏ శక్తీ కూడా భారత్ పురోగతిని అడ్డుకోలేదని యోగి స్పష్టం చేశారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సభలో యోగి మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మమంటే మానవత్వమని చెప్పారు. అంతకు ఒక రోజు ముందే యోగి సనాతన ధర్మమే భారత జాతీయ ధర్మమని, బ్రాహ్మణులను, గోవులను కాపాడాలని పేర్కొన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పున: స్థాపన జరగాలని రాజస్థాన్ జాలౌర్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పారు.

500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామని తెలిపారు.  దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి రెండోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్ కారణమైంది. అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుని బీజేపీ వరుసగా విజయకేతనాలు ఎగురవేయడానికి యూపీ కేంద్రంగా నిలిచింది.