ఎస్పీ, ఆర్జేడీల గుర్తింపు రద్దు చేయమన్న వీహెచ్‌పీ

రామాయణ కథ ‘రామచరిత్‌మానస్’పై సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్  రాజీవ్ కుమార్ ను కోరింది.

 ఇటీవల బిహార్ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రశేఖర్, సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బిహార్ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రశేఖర్ ఇటీవల మాట్లాడుతూ, రామచరిత్‌మానస్ సమాజంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ పుస్తకం మనుస్మృతికి, ఎంఎస్ గోల్వాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’కు అనుగుణంగా ఉందని ఆరోపించారు.

ఈ ఆరోపణలను సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సమర్థించారు. ఈ పుస్తకంలోని కొన్ని శ్లోకాలు కులతత్వంతో, వెనుకబడిన కులాలు, దళితులకు అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు.   ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల గుర్తింపును రద్దు చేయాలని భారత ఎన్నికల సంఘంను వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ అపాయింట్‌మెంట్ కోరారు.

వీహెచ్‌పీ విడుదల చేసిన ఓ ప్రకటనలో, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29ఏను సీఈసీ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపింది. లౌకికవాదం, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పట్ల విధేయంగా వ్యవహరిస్తామని, నిజమైన విశ్వాసాన్ని కలిగియుంటామని తెలిపే ఓ నిబంధన ప్రతి రాజకీయ పార్టీ మెమొరాండంలోనూ ఉండాలని ఈ సెక్షన్ చెప్తోందని పేర్కొంది.

మౌర్య, రామచరిత్‌మానస్‌పై వ్యాఖ్యలు చేసిన తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపింది. ఆర్జేడీ నేత చంద్రశేఖర్ వ్యాఖ్యలు హిందూ సమాజంలోని వివిధ వర్గాల మధ్య అపనమ్మకం, విభజనను సృష్టించేవిధంగా ఉన్నాయని పేర్కొంది.  వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ విడుదల చేసిన వీడియో ప్రకటనలో, సమాజంలో శత్రు భావాలను సృష్టించి, తద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నం చేసిన ఈ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.