ఇక ఎన్నికలలో పోటీచేయనని ప్రకటించిన యడ్యూరప్ప

కర్ణాటక రాజకీయాలను మలుపు తిప్పి, దక్షిణాదిన తొలి బిజెపి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని, కోరిక కూడా లేదని ఆయన వెల్లడించారు.
తన వయసు 80 దాటినందున పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
పార్టీలో క్రియాశీలకంగా ఉండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోదీని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు.

మరో కొద్దీ నెలల్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో సహితం బిజెపి 140 సీట్లు గెలిచి, తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా తాను కృషిచేస్తానని తెలిపారు.

మరో నాలుగైదు నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పార్టీలో యడ్యూరప్ప ప్రాధాన్యం పెరుగుతూ వస్తున్నది. పార్టీ కేంద్ర పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న యడ్యూరప్పకు రాష్ట్రంలో విశేషమైన ప్రజాబలం గల అతికొద్దిమంది నాయకులలో ఒకరు.

యడ్యూరప్ప తొలిసారి 2007 నవంబర్‌ 12 న కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, కేవలం 7 రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం 2008 మే 30 న రెండోసారి ముఖ్యమంత్రయ్యారు. కానీ, 2011 ఆగస్టు 4 న రాజీనామా చేశారు. 2018 మే 17 న మూడోసారి సీఎం పీఠం అధిష్ఠించిన యెడ్డీ.. 6 రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. 2019 జూలై 26 న నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి.. సరిగ్గా రెండేండ్ల తర్వాత రాజీనామా చేశారు.