మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వెనుక చైనా!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వెనుక చైనా ఉందని బీజేపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ  ఆరోపించారు. చైనా కంపెనీ హువాయ్ నుంచి నిధులు అందుకుని బీబీసీ ఇలాంటి తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు. బీజింగ్ అజెండాను బీబీసీ అమలు చేస్తోందంటూ ఆయన ట్వీట్ చేశారు.

బ్రిటన్‌కే చెందిన స్పెక్టేటర్ కథనాన్ని ఆయన ట్వీట్‌కు జోడించారు. కామ్రేడ్ జైరామ్ కూడా బీబీసీ ఫాలోయరేనని జెఠ్మలానీ ఆరోపణలు చేశారు. బీబీసీకి ప్రస్తుతం డబ్బులు అవసరమని, అందుకే చైనా కంపెనీ నుంచి తీసుకుందని ఆయన పేర్కొన్నారు. బీబీసీ వ్యవహారం ముమ్మాటికీ డబ్బులు తీసుకుని దుష్ప్రచారం చేయడమేనని ఆయన తేల్చి చెప్పారు.

బీబీసీ చాలా కాలంగా భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని కూడా ఆయన ట్వీట్ చేశారు. 2021లో జమ్మూకశ్మీర్ లేకుండా భారత్ మ్యాప్ ప్రచురించిన విషయాన్ని కూడా జెఠ్మలానీ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీసిన డాక్యుమెంటరీ కూడా అదే తరహా దుష్ప్రచారమేనని ఆయన ట్వీట్ చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారతీయ జనతా పార్టీ నేత అమిత్ మాలవీయ మండిపడ్డారు. భారత్‌కు చట్టాలపై, పాలనపై, మానవ హక్కులపై నీతులు చెప్పొద్దంటూ ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ హితవు పలికారు. గుజరాత్ అల్లర్ల పేరుతో మోదీని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పన్నిన కుట్ర భగ్నమైందని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.