2047నాటికల్లా ఆత్మనిర్భర్ భారత్‌గా దేశం

‘75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు పూర్తి చేసుకున్నాం, కొన్ని నెలల క్రితమే అమృత్ మహోత్సవాలు నిర్వహించుకున్నాం. 2047నాటికల్లా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. పేదరికంలేని భారత్ నిర్మాణం కోసం కృషి జరుగుతోంది. పౌరులందరి అభివృద్ధే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తోంది’ అని  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు.
 
పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘2047 కల్లా దేశం సువర్ణ అధ్యాయాలను లిఖిస్తుంది. మనం దేశాన్ని ‘ఆత్మనిర్భర్’ గా నిర్మించుకున్నాం, దేశ ప్రజల అభివృద్ధి, రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయంగా వ్యవహరిస్తోంది, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది’ అని కొనియాడారు.

వరుసగా రెండుసార్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రభుత్వం (ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం) ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందని, విధానపరమైన వ్యూహాన్ని సమూలంగా మార్చే దృఢనిశ్చయాన్ని ప్రదర్శిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.

స్వాతంత్ర్యం సిద్ధించి 2047నాటికి వందేళ్లు పూర్తవుతుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పాతికేళ్ళ కాలం అమృత కాలమని చెప్పారు. మనమంతా, దేశంలోని ప్రతి పౌరుడు మన కర్తవ్యాలను ఆచరించడంలో అత్యున్నత స్థాయిని ప్రదర్శించవలసిన సమయం ఇదని ఆమె

 నేడు ప్రతి భారతీయుడి ఆత్మ విశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందని చెబుతూ నేడు ప్రపంచం మనల్ని చూస్తున్న తీరు అద్భుతమని రాష్ట్రపతి తెలిపారు. గతంలో మనం ప్రపంచంపై ఆధారపడేవారమని, ఇప్పుడు ప్రపంచమే మనపై ఆధారపడుతోందని ఆమె చెప్పారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నామని ఆమె పేర్కొన్నారు.

మధ్య తరగతి ప్రజలు కూడా సంపన్నులు కావాలని చెబుతూ సమాజానికి, దేశానికి దిశా నిర్దేశం చేయడానికి యువత, నారీశక్తి ముందు వరుసలో ఉండాలని ఆమె తెలిపారు. కాలానికి రెండు అడుగులు ముందు నిలిచే యువత గల దేశంగా భారత దేశం ఎదగాలని రాష్ట్రపతి ఉద్భోధించారు.

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత నెలకొన్న విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ, ప్రపంచంలో రాజకీయ అస్థిరత ఎక్కడ ఉన్నా, ఆ దేశాలు పెద్ద ఎత్తున సంక్షోభంలో చిక్కుకుంటాయని ద్రౌపది ముర్ము హెచ్చరించారు. తన ప్రభుత్వం దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాల వల్ల భారత దేశం ఇతర దేశాలతో పోల్చినపుడు మెరుగైన స్థితిలో ఉందని ఆమె తెలిపారు.

వందేళ్ళలో అతి పెద్ద సంక్షోభం (కరోనా మహమ్మారి) వచ్చిందని, ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయని, అటువంటి పరిస్థితులను పరిష్కరించడంలో సుస్థిర, నిర్ణయాత్మక ప్రభుత్వం వల్ల కలిగే ఫలితాలను, ప్రయోజనాలను మనం నేడు పొందుతున్నామని ఆమె చెప్పారు. నరేంద్ర మోదీ నేత‌త్వంలోని ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రక్షణ రంగంలో ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని ద్రౌపది ముర్ము చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ రూపంలో తొలి స్వదేశీ విమాన వాహక నౌక నావికా దళంలో చేరడం గర్వకారణమని ఆమె తెలిపారు.

ప్రజాస్వామ్యానికి, సాంఘిక న్యాయానికి అతి పెద్ద శత్రువు అవినీతి అని తన ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయం ఉందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. అందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి అవినీతిపై నిరంతర పోరాటం జరుగుతోందని ఆమె తెలిపారు. అదే సమయంలో నిజాయితీపరులకు గౌరవం దక్కే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, పరారయ్యే నేరగాళ్ళ ఆస్తులను జప్తు చేసేందుకు ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్‌ను తన ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆమె గుర్తు చేశారు. తన ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరిగిందని పేర్కొంటూ అవినీతి రహిత దేశంగా మారే దిశగా భారత్ పయనిస్తోందని ఆమె భరోసా వ్యక్తం చేశారు.

డిజిటల్ ఇండియా దిశగా భారత్ ముందుకెళ్తోందని, నూతన సాంకేతికత ఆధారంగా పౌరులకు సేవలు అందుతున్నాయని, నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయని, భారత డిజిటల్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారిందని ముర్ము తెలిపారు. మూడు కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించామని, ఉచిత బియ్యం నిరుపేదలకు అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
 
తొలిసారి దేశంలో పురుషుల కన్నా మహిళా సంఖ్య పెరిగిందని చెబుతూ మహిళా సాధికారతను ప్రోత్సాహిస్తున్నామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న కఠిన వైఖరిని ప్రపంచం ఇప్పుడు అర్థం చేసుకుంటోందని ముర్ము చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ రైల్వే నెట్‌వర్క్‌గా భారత రైల్వే అడుగులేస్తోందని ఆమె తెలిపారు.