భంగపాటుకు గురై  గవర్నర్ వద్దకు మంత్రి ప్రశాంత్ రెడ్డిని పంపిన కేసీఆర్ !

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించాలని ప్రయత్నించిన సీఎం కేసీఆర్ భంగపాటుకు గురయ్యారు.  బడ్జెట్ లో గవర్నర్ ప్రసంగంపై హైకోర్టులో వెనక్కి తగ్గిన ప్రభుత్వం గవర్నర్ తో సయోధ్యకు వచ్చింది. వెంటనే సాయంత్రంకల్లా  రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు.
 
సమావేశం అరగంట పాటు సాగింది. బడ్జెట్‌ ముసాయిదాకు ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌ను మంత్రి కోరారు. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు. 3న ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి గవర్నర్‌ అంగీకరించారు.
బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ ఆమెను లాంఛనంగా ఆహ్వానించారు.
 
ఈ భేటీ కాగానే,  సత్వరమే తెలంగాణ బడ్జెట్‌కు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. ఈ కేసును నిన్న విచారించిన హైకోర్టు చివరకు ఇరువురి మధ్య సయోధ్యను కుదిర్చిన్నట్లయింది. దానితో వరుసగా గవర్నర్ విషయంలో కేసీఆర్ కు ఎదురుదెబ్బలు తగిలినట్లయింది. గతేడాది మాదిరిగానే ప్రభుత్వం ఈసారి కూడా శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. 
 
మొన్న గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని, పెరేడ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దాంతో సర్కారు కొంత వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు తాజాగా గవర్నర్‌తో రాజీ పడేట్లు చేసి, అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేట్లు చేసింది.
 
గవర్నర్‌ తీరును ఎత్తి చూపాలని తలచిన ప్రభుత్వానికి ఇది ఊహించని పరిణామమే. చేసేది లేక గవర్నర్‌ ప్రసంగాన్ని ఉండేలా చూస్తామంటూ హైకోర్టుకు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు, గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదంటూ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. రాజ్యాంగబద్ధంగా ముందుకెళతామని.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని  కోర్టుకు తెలియజేసింది. కాగా, కేసులో ఉన్న అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హతపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదని.. చర్చలు ఫలప్రదంగా ముగిసినందున పిటిషన్‌లో విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఇదివరకు ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం… అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభించాల్సి ఉంది. అదేరోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీల్లో మార్పు చోటు చేసుకోనుంది. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10కి గవర్నర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 6న  ఉదయం 10.30కు బడ్జెట్‌ ప్రవేశపెడతారని చెబుతున్నారు.

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రెండోసారి ప్రసంగించబోతున్నారు. 2019 సెప్టెంబర్‌లో ఆమె గవర్నర్‌ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ… గతంలో ఒక్కసారి మాత్రమే ప్రసంగించే అవకాశం వచ్చింది. 2020లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా ఆమె ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. 2021లో మాత్రం కరోనా కారణంగా ప్రభుత్వం బడ్జెట్‌ను వర్చువల్‌గా ప్రవేశపెట్టింది. దీంతో అప్పుడు ప్రసంగాలు, సమావేశాలు పెద్దగా లేవు. 2022 మార్చి 7న బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం… గవర్నర్‌ ప్రసంగం లేకుండా చేసింది. అప్పుడు ఇది పెద్దగా చర్చకు దారి తీసింది.