గవర్నర్ పై కోర్టుకు వెళ్లి భంగపడ్డ కేసీఆర్

కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటిలాగే గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను మరోసారి అవమానించాలని భావించి, కోర్టుకెళ్లి భంగపడిందని, చివరికి బడ్జెట్ సమావేశాల తేదీ కూడా మార్చుకునే ఆలోచన చెయ్యాల్సి వచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. మరీ ముఖ్యంగా గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్‌ దవే చెప్పాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు.
 
రాజ్యాంగంపై, చట్టపరమైన విధులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపాటి గౌరవం ఉందో బడ్జెట్ సమావేశాల విషయంలో ఆయన అనుసరించిన వ్యవహారశైలితో బాగా అర్థమైందంటూ ఆమె ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆమోదం ఇవ్వలేదంటూ సర్కారు కోర్టుకెక్కడం యావత్ ప్రభుత్వ యంత్రాంగానికే తలవంపుల్లాంటిదని ఆమె పేర్కొన్నారు.
 
బడ్జెట్ సమావేశాలకు ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్ సిద్ధంగా ఉన్నారు కాబట్టే, తమ ప్రసంగానికి సంబంధించిన వివరాల కోసం ఆమె అడిగారని విజయశాంతి స్పష్టం చేశారు.  పదే పదే గవర్నర్‌ను ఎలా అవమానించాలా… అనే ధ్యాస తప్ప ఈ సర్కారుకి మరో పనిలేదని స్పష్టమైందని ఆమె ధ్వజమెత్తారు.  అందుకే రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై సీ-ఓటర్‌ ఇండియా టుడే నిర్వహించిన సర్వే వెల్లడించిన బెస్ట్ సీఎం జాబితాలో కేసీఆర్ సోదిలో కూడా లేకుండా పోయారని ఆమె ఎద్దేవా చేశారు .

ముందు రాజ్యాంగం చదువు

కాగా, 80 వేల పుస్తకాలు చదివిన అని గప్పాలు కొట్టుకునే సీఎం కేసీఆర్..ముందు రాజ్యాంగాన్ని చదవాలని వైస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హితవు చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించాలని ప్రయత్నించిన సీఎం కేసీఆర్ భంగపాటుకు గురయ్యారని  ఆమె  ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తూ కోర్టుల్లో కేసీఆర్ అడ్డంగా దొరికిపోతున్నారని ఆమె విమర్శించారు.

బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం రాకపోయే సరికి అయోమయంలో పడి కోర్టుకెక్కి నవ్వుల పాలయ్యాడని ఆమె చురకలంటించారు. బడ్జెట్ ను ఆమోదించేలా గవర్నర్ ఆదేశించాలని కోర్టుకెళ్లే కేసీఆర్ కు..నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో మాట్లాడే ధైర్యం లేదా అని షర్మిలా  ప్రశ్నించారు.  కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ కేసీఆర్ బుర్ర పనిచేయదా? అని ఆమె ఎద్దేవా చేశారు.