ముంబై ప్రసంగంపై రాజాసింగ్ కు హైదరాబాద్ పోలీసులు నోటిస్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ర్యాలీలో విద్వేష ప్రసంగం చేశారంటూ ఎమ్మెల్యేకు మంగళ్‌హాట్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత ఆదివారం లవ్ జిహాద్‌ కు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలన్న డిమాండ్‌తో ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై  మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముంబైలోని దాదర్లో జరిగిన జనాక్ క్రోస్ మోర్చా ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారంటూ రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు.

రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ఎత్తివేసే సందర్భంగా హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని పోలీసులు అందులో ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెండు రోజుల్లో సమాధానాలు ఇవ్వాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళహాట్ పోలీసులు స్పష్టం చేశారు.  అయితే, తెలంగాణ నుంచి బహిష్కరించినా, జైలుకు పంపినా ధర్మం కోసం పనిచేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తెలంగా” ణలో 8వ నిజాం పాలన సాగుతోందని మండిపడుతూ లవ్ జిహాద్, గో హత్యపై మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వనికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు.

‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చట్టం తేవాలి అని డిమాండ్ చేస్తున్న అది కూడా మహారాష్ట్రలో మాట్లాడిన. మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్‌హాట్ పోలీసులు నాకు లవ్ లెటర్స్ పంపిస్తున్నారు. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. నిన్న నాకు మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీపై పీడియాక్ట్ పెట్టగా హైకోర్టు ఉత్తర్వులతో మీరు బయట ఉన్నారని వాటిని ఉల్లంఘిస్తున్నారని నోటీసులు ఇచ్చారు” అంటూ విమర్శించారు.

తాను ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెబతూ ఇక తనకాది చాలని, ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. “మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అంటూ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గతంలో కూడా రాజాసింగ్‌కు రెండు సార్లు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. గతేడాది ఆగష్టులో అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ 41ఏ సీఆర్పీసీ  కింద నోటీసులు జారీ చేశారు. అయితే కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌ లో నమోదైన కేసు మంగళ్‌‌హాట్ పోలీస్‌స్టేషన్‌ కు బదిలీ అవడంతో మంగళ్‌‌హాట్ పోలీసులు నోటీసులు పంపారు. అలాగే ఫేస్‌బుక్‌ లో ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు రాజాసింగ్ కామెంట్ పెట్టగా.. అది ఓ మతాన్ని కించపరిచే విధంగా ఉందంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.