బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిఇంట్లో ఐటీ సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇల్లు, ఆయనకు సంబంభిందినవిగా చెప్పుకుంటున్న పలు సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయనకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రాజపుష్పతోపాటు.. వసుధ ఫార్మా, మరో రెండు రియల్‌ఎస్టేట్‌ సంస్థల్లో మంగళవారం ఆదాయపన్ను(ఐటీ) శాఖ సోదాలు నిర్వహించింది.
వెంకట్రామిరెడ్డికి సంబంధించి ఇళ్లు ఏకంగా 10 ఎకరాల్లో ఉంది. వెంకట్రామిరెడ్డి, ఆయన సోదరుడు ఇక్కడ నివాసం ఉంటుండగా..ఎకరంలో ఇళ్లు నిర్మించి ఉంది. ఈ ఇల్లు అత్యంత అధునాతన సౌకర్యాలతో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో అధికారులు పలు డాక్యుమెంట్లను, బ్యాంకు  ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
 
ఐఏఎస్ అధికారిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా అధికారపార్టీ కనుసన్నలలో పనిచేసిన్నట్లు ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కొన్న ఆయన ప్రభుత్వ సర్వీస్ కు రాజీనామా చేసి, అధికార పార్టీలో చేరి ఎమ్యెల్సీ కావడం గమనార్హం.  తెల్లపూర్‌లో వసుధ ఫార్మా, రాజ్ పుష్ప, వర్టెక్స్, ముప్పా సంస్థలు సహా 51 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 5 వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఏక కాలంలో రైడ్స్ చేశారు.
 
రాజ్ పుష్పలో వెంకట్రామిరెడ్డి వియ్యంకుడు భాగస్వామిగా ఉన్నట్లు తెలిసింది. వర్టెక్స్‌లో కంపెనీలోనూ కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భాగస్వాములుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఉదయం ముందుగా.. వసుధ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వసుధ ఫార్మా పేరుతో రాజు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 15 కంపెనీల పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు ఐటీ గుర్తించింది.
 
వసుధ ఫార్మా ఛైర్మన్‌గా రాజు ఉండగా.. అతడి ఇళ్లతో పాటు సంస్థ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న మరో ఆరుగులు ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు, విజయవాడ, వైజాగ్‌లలో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇలా ఏక కాలంలో ఐటీ రైడ్స్ జరగటం కలకలం రేపుతున్నాయి. కాగా..ఈ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.