తెలంగాణ ఇంటర్ బోర్డులో ఆన్‌‌లైన్ వాల్యుయేషన్ వివాదం

ఇంటర్ బోర్డులో ఏకపక్షంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ వాల్యుయేషన్ వివాదం రచ్చకెక్కింది. ఒకేసారి ఎక్కువ పేపర్లు దిద్దిస్తే నష్టమని లెక్చరర్ల సంఘం నేత మధుసూదన్ రెడ్డి అభ్యంతరం చెబుతుండగా, ఆన్‌‌లైన్ వాల్యుయేషన్‌‌లో పారదర్శకత ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ అంటున్నారు. ఈ విషయమై వివాదం కొనసాగుతుండగా,  ఇంటర్ కమిషనరేట్‌‌కు సమాంతరంగా మరో కమిషనర్ వ్యవస్థ నడుస్తోందని నవీన్ మిట్టల్ సంచలన ఆరోపణలు చేశారు.

అంతటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నవీన్ మిట్టల్ ను రెండు రోజులలోనే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుండి బదిలీ చేసి రెవిన్యూ కార్యదర్శిగా నియమించడం ఆసక్తి కలిగిస్తుంది.  ఇంటర్ కమిషనరేట్లో సీసీ కెమెరాల టాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ  మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నవంబర్‌‌‌‌లో జరిగిన ఇంటర్ బోర్డు మీటింగ్‌‌లో.. ఆన్లైన్ వాల్యుయేషన్‌‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని విద్యా శాఖ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.

సైన్స్ సబ్జెక్టులు మినహా లాంగ్వేజెస్, ఆర్ట్స్ సబ్జెక్టులన్నింటిలో సుమారు 35 లక్షల జవాబు పత్రాలకు ఆన్‌‌లైన్ వాల్యుయేషన్ అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి  నవీన్ మిట్టల్ ఇటీవల టెండర్ నోటిఫికేషన్ విడుదల  చేశారు. దీనిపై  జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

“ఒకేసారి 35 లక్షల జవాబు పత్రాలకు అమలు చేయడం సరికాదు. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఎవరికీ దీనిపై అవగాహన కూడా లేదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో అమలు చేయడం వెనుక నవీన్ మిట్టల్ పాత్ర ఉంది. దీనిపై విచారణ చేయించాలి” అని డిమాండ్ చేశారు.

ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపుల్లాంటి క్రిమినల్ కేసులున్న, సస్పెండైన జూనియర్ లెక్చరర్.. బోర్డుపై తప్పుడు ఆరోపణలు చేశారని అంటూ ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మండిపడ్డారు. బోర్డుకు సంబంధం లేని వ్యక్తి.. వాల్యుయేషన్పై అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నారని అంటూ  కానీ ఆన్ లైన్ వాల్యుయేషన్‌‌లో పారదర్శకత ఉంటుందని వెల్లడించారు.

సొంత కంప్యూటర్లు, లాప్ టాప్లు ఉంటే ఇంట్లోంచి కూడా వాల్యుయేషన్ చేసుకునే అవకాశం  ఉంటుందని,  ఖర్చు, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ప్రక్రియ ఈజీగా చేసుకోవచ్చని, స్టూడెంట్స్ సౌలభ్యం కోసమే ఆన్లైన్ వాల్యుయేషన్ తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటికే ఓయూ, అంబేద్కర్ వర్సిటీ, జేఎన్టీయూ, పాలిటెక్నిక్ తో పాటు పలు వర్సిటీల్లోనూ ఆన్లైన్ వాల్యుయేషన్ జరుగుతున్నదని తెలిపారు.

తాము ఒక మంచి పని చేస్తుంటే.. సస్పెండైన వ్యక్తికి నొప్పేంటని ప్రశ్నించారు. బోర్డు మీటింగ్‌‌లో సైన్స్ మినహా అన్నింటికీ అమలు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారని, బోర్డు నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు.  ఇలా ఉండగా, ఇంటర్ బోర్డులో డేటా చోరీ అయిందని, దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. సీసీ కెమెరాల పాస్ వర్డ్ కూడా ప్రస్తుతం ఉద్యోగం లేని వ్యక్తి చేతిలో ఉందని ఆరోపించారు. మాన్యువల్ వాల్యుయేషన్తో డబ్బు సంపాదించే వారే, ఆన్ లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.

గతంలో కొందరు ఆన్సర్ షీట్లనూ ట్రాకింగ్ చేశారని తమ దృష్టికి వచ్చిందని, దీంతోనే ఆన్లైన్ చేస్తున్నట్టు చెప్పారు. గతంలో మాదిరి తప్పుడు రికార్డు ఉన్న సంస్థలకు ఆన్ లైన్ వాల్యుయేషన్ బిడ్డింగ్లో అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, సీసీ కెమెరాలను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలతో లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిపై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో  తెల్లవారుజామున కేసు నమోదైంది. అడ్మిన్ పాస్ వర్డ్ మార్చారని, తన అనుమతి లేకుండానే ఫుటేజీ సేవ్ అయ్యే గడువు 60 రోజుల నుంచి 23 రోజులకు మారిందని ఇంటర్ కమిషనరేట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసిన టెక్నీషియన్ యుసుఫ్‌‌ను బెదిరించారని చెప్పారు.